అలా ముగిసిన ఏపీ సభా సమరం!

Update: 2019-07-30 17:55 GMT
ఆంధ్రప్రదేశ్ శాసనసభ - శాసనమండలి నిరవధికంగా వాయిదా పడ్డాయి. అధికార - ప్రతిపక్ష పార్టీల మధ్యన పలు అంశాల గురించి తీవ్రమైన వాగ్వాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో సమావేశాలు ఆసక్తిదాయకంగా జరిగాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాగా బడ్జెట్ సెషన్స్ గా ఈ సమావేశాలను నిర్వహించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. నవరత్నాల అమలుకు ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తూ బడ్జెట్ ప్రకటించారు.

ఇక గత ప్రభుత్వ  హయాంలో చోటు చేసుకున్న వివిధ అంశాల గురించి కూడా ఈ సమావేశాల్లో గట్టిగానే చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో అధికార - ప్రతిపక్ష పార్టీల మధ్యన సవాళ్ల యుద్ధం నడించింది. సభలో తాము చెప్పిన అంశాల గురించి చర్చ జరపాలని పట్టు పడుతూ తెలుగుదేశం పార్టీ సభ్యులు ముందుగా ముగ్గురు సస్పెండ్ అయ్యారు. వారిని సమావేశాలు జరిగినన్ని రోజులూ కూడా స్పీకర్  సస్పెండ్ చేశారు.

అనంతరం అదే రీతిన వ్యవహరించిన మరింత మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా శాసనసభ నుంచి సస్పెండ్ అయ్యారు. ఇక సమావేశాలు పూర్తయ్యే వరకూ కూడా టీడీపీ అధినేత - ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సభకు హాజరు కాకపోవడం గమనార్హం.  సమావేశాలు సాగుతుండగానే చంద్రబాబు నాయుడు అమెరికా వెళ్లారు.

ఆరోగ్య చికిత్స కోసమని ఆయన సమావేశాల మధ్యలోనే యూఎస్ వెళ్లారు.  చివరి రెండు రోజులూ ప్రధాన ప్రతిపక్ష నేత లేకుండానే సభ సాగింది. మంగళవారంతో నిరవధిక వాయిదా పడింది. అలాగే ఏపీ శాసనమండలి కూడా నిరవధిక వాయిదా పడింది.


Tags:    

Similar News