రేపు కూడా డిమాండ్ చేస్తేనే వారిది చిత్తశుద్ధి!

Update: 2018-01-11 17:30 GMT
ఆంధ్రప్రదేశ్ లోని భారతీయ జనతా పార్టీ నాయకులకు కొన్ని రోజులుగా విపరీతమైన ఆగ్రహం పొంగుకొస్తోంది. ప్రభుత్వం ఓకే చేసిన నాలా బిల్లు మీద గవర్నర్ సంతకం పెట్టకపోవడం వారికి విపరీతమైన కోపం తెప్పించింది. గవర్నర్ ఏపీ అభివృద్ధికి అడ్డు పడుతున్నారని కొందరు, గవర్నరు మీద కేంద్రంలోని తమ ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాం అని కొందరు... అసలు ఏపీ కొత్త గవర్నరు కావాల్సిందే అని కొందరు ఇలా ఎవరికి తోచినట్లు వారు రెచ్చిపోయారు. అయితే ఇవాళ బిల్లు మీద గవర్నర్ సంతకం అయిపోయింది. ఇప్పుడు భాజపా నాయకులు ఏం చేస్తారు? గవర్నర్ మీద విమర్శలను కొనసాగిస్తారా? ఆయనను మార్పుకోసం ప్రయత్నిస్తారా? లేదా మిన్నకుండి పోతారా? అనేది మీమాంస? రేపు కూడా కొత్త గవర్నర్ కావాలని డిమాండ్ చేస్తేనే.. వారిలో చిత్తశుద్ధి ఉన్నట్లుగా పరిగణించాలని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఏపీలో ప్రస్తుతం గవర్నర్ సంతకానికి నోచుకున్న నాలా బిల్లు చాలా కీలకమైనది. ఎందుకో తెలియదు గానీ.. ఈ బిల్లు గవర్నరు కు పంపిన తర్వాత.. అక్కడ సంతకం కాకుండా జాప్యం జరుగుతోంటే.. ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పెద్దలుకాకుండా.. భాజపా వారు చాలా అసహనానికి గురయ్యారు. శాసనసభలో తప్ప బటయపెద్దగా ప్రెస్ మీట్లు పెట్టే అలవాటు లేని పార్టీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు.. గవర్నరు మీద ఒక రేంజిలో రెచ్చిపోయారు. ఏపీలో పారిశ్రామిక పురోగతి రాకుండా గవర్నర్ కుట్ర పూర్వకంగా అడ్డు పడుతున్నారంటూ ఆరోపణలు చేశారు.

మరోవైపు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ఏకంగా మాకు కొత్త గవర్నర్ కావాల్సిందే అని తీర్మానించడం కీలకం. ఆయన కూడా నాలా బిల్లును ప్రస్తావించినా.. అసలు రాష్ట్రప్రభుత్వం మొత్తం  అమరావతికి తరలిపోయినా.. గవర్నర్ నివాసం ఇక్కడలేకపోవడం, ఆయన ఇక్కడకు మారకపోవడం శోచనీయం అని.. తమ రాష్ట్రానికి విడిగా ఒక కొత్త గవర్నరు ఉంటే తప్ప.. ఆయన ఇక్కడే సదా నివాసం ఉంటే తప్ప.. ఇక్కడి సమస్యలను అర్థం చేసుకోలేరని, ఇక్కడి పరిస్థితులకు స్పందించలేరని చాలా సంగతులు చెప్పారు.

బిల్లు సంగతి పక్కన పెడితే... వారు చెప్పిందంతా నిజమే అనుకుందాం. రేపు కూడా కొత్త గవర్నర్ కోసం డిమాండును కొనసాగిస్తేనే భాజపా నాయకులకు రాష్ట్రంపై చిత్తశుద్ధి ఉన్నట్లుగా భావించాలని.. ఇక్కడితో గవర్నర్ పై విమర్శలను మానేస్తే.. నాలా బిల్లు పై సంతకాల కోసం బ్లాక్ మెయిల్ చేసినట్లుగా భావించాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Tags:    

Similar News