అధికార పార్టీ డ‌బుల్ స్కెచ్ వేస్తోంది

Update: 2016-09-27 22:30 GMT
విభజిత ఆంధ్రప్రదేశ్‌ లో ఏపీకి ప్రత్యేకహోదా అంశం అన్ని ప్రతిపక్షాలకు ఊపిరిగా మారుతుంటే అధికారంలో నున్న మిత్రపక్షాలు టీడీపీ-బీజేపీల‌కు పెద్ద సంకటంగా ఈ అంశం మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో - మున్ముందు కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ స్పష్టంచేసింది. హోదాకు బదులుగా ఏపీకి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీయేనన్న స్పష్టతను ఇప్పటికే ఇచ్చేసింది. దీంతో ఏపీకి ప్రత్యేకహోదా కంటే ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీయే ఈ రాష్ట్రాన్ని ఆదుకొంటుందన్న భావనను ఇక్కడి ప్రజానికంలో కలిగించాలని ఏపీ బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. అదే స‌మ‌యంలో త‌మ పార్టీకి చెందిన ఢిల్లీ నాయ‌కులు ఇచ్చిన నిధులు దుర్వినియోగం అవుతున్నాయ‌ని కూడా తెలియ‌జెప్పేందుకు సిద్ధం అవుతున్నారు.

ఏపీలో ప్రత్యేకహోదా అంశం సెంటిమెంటుగా మారుతున్న తరుణంలో దీనికోసం పార్టీ హైకమాండ్‌ తో పోరాడలేని స్థితిని ఎదుర్కొంటున్న ఏపీ బీజేపీ నేతలు ఆర్థిక ప్యాకేజీయే మేలన్న భావన జనంలో కలిగించడమే ఏకైక మార్గంగా భావిస్తున్నారు. ఈ భావనను ప్రజల్లో రెక్కెత్తించే ముందు ఏపీకి ఇంతవరకు నరేంద్రమోడీ సర్కార్ నిధుల రూపంలో చేసిన సహాయమెంత‌ - ఇతర విషయాలలో చేసిన సహాయమెంత‌ అన్న ప్రస్తావన తరచూ మీడియా ద్వారా జనంలోకి తీసుకెళ్లాలని ఏపీ బీజేపీ నాయకత్వం భావిస్తోంది. ఇప్పటి వరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపీకి నిధుల పరంగా చేసిన సహాయం మీడియా ముందు పూర్తిగా వివరించి చెబితే, కేంద్రం ఇచ్చే ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీతో ఏపీకి మరింత మేలు జరుగుతుందన్న భావనకు ప్రజల్లో బీజం వేయవచ్చుని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ ఏపీ నేతలు ప్రత్యేకప్యాకేజీ పల్లవిని ఎక్కడపడితే అక్కడ అందుకొంటున్నారు. ఏపీకి కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ ఇంతవరకు చేసిన సహాయాన్ని ఏపీ బీజేపీ నేతలు మీడియా ముఖంగా ప్రస్తావించ‌డంతో పాటు సామాజిక మాధ్యమాలైనా వాట్సప్ - సోషల్ మీడియాను ఈ వివరాల వెల్లడి కోసం వేదికగా వాడుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే వాట్సప్ గ్రూపులను సృష్టించిన బీజేపీ శ్రేణులు ఎవరికి వారు ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేసిన సహాయంపై ప్రచారం పెంచనున్నారు. తద్వారా ఏపీలోని టీడీపీ సర్కార్ కేంద్రం ఇచ్చిన నిధులను దారిమళ్లిస్తోందని - పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడంలేదన్న ప్రచారం కూడా ఇటీవల బీజేపీ నేతలు విస్తృతం చేస్తున్నారు.

ఇదిలాఉండ‌గా ఏపీకి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీతోపాటు ప్రత్యేక హోదా రెండూ ఇవ్వాల్సిందేనని రాష్ట్రంలోని అన్ని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రవిభజన బిల్లులో ఏపీకి ఇచ్చిన పలు హామీల అమలుకోసం అయ్యే నిధుల మొత్తం యొక్క రూపమే ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ అని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. విభజన హామీల అమలు కోసం ఈ ప్యాకేజీ ఏపీకి హక్కుగా కేంద్రం ఇవ్వాల్సివుందని, దీనిని ప్రత్యేకహోదాకు ప్రత్యామ్నాయం అని ఎలా చెబుతారు అని వైసీపీ ప్రశ్నిస్తోంది. దీనిపై బీజేపీ నేతలు నేరుగా స్పందించకపోయినా ఆర్థిక ప్యాకేజీతో ఏపీకి తమ కేంద్ర ప్రభుత్వం ఎంతోమేలుచేస్తోందని, ఇదే జనంలోకి తీసుకెళ్తామని భ‌రోసాగా ఉన్నారు. ఈ ప్యాకేజీ ప్రత్యేకహోదా సెంటిమెంటును ఎంతవరకు ఎదుర్కొంటుంది అన్న ప్రశ్నకు కాలమే వాటికి సమాధానం చెబుతుందనేది బీజేపీ వ‌ర్గాల‌ భావ‌న‌.
Tags:    

Similar News