పవన్ కోసం మళ్లీ ఫ్లెక్సీలు

Update: 2015-10-31 06:12 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి కోసం భూముల సేక‌ర‌ణ అంశం మ‌రోమారు రాజ‌కీయ ప‌రిణామాల‌కు వేదిక‌గా మారుతోంది. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు - పి.నారాయణ వేర్వేరు సందర్భాల్లో మాట్లాడుతూ రాజ‌ధాని నిర్మాణం కోసం భూసేకరణ చట్టం ప్రయోగిస్తామని ప్రకటించడంతో రాజధాని మండలాల్లో అలజడి రేగింది. ఇప్పటికే మంగళగిరి - తాడేపల్లి మండలాల రైతులు భూములివ్వలేమంటూ న్యాయస్థానాల్ని ఆశ్రయించి ఉద్యమ బాటలో నడుస్తుండ‌గా.... తాజాగా తుళ్లూరు రైతులు కూడా జతకట్టేందుకు రెడీ అయ్యారు. ఆరునూరైనా మరో వారంలో భూసేకరణ చట్టం అమలుచేస్తామని ఏపీ మంత్రులు చెబుతున్న ప‌రిస్థితుల్లో జ‌న‌సేన అధినేత‌ - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్లెక్సీలు మ‌రోమారు తెర‌మీద‌కు వ‌చ్చాయి.

జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటి సారిగా రాజ‌ధాని ప్రాంత‌ మంగళగిరి - తాడేపల్లి మండలాల రైతులు ప్రజావేదికను ఏర్పాటు చేసిన‌ సంగతి తెలిసింది. రెండు నెల‌ల కిందట కూడా ప్ర‌భుత్వం భూసేకరణ చట్టం అమలు చేస్తామని ప్రకటించినప్పుడు పవన్‌ కల్యాణ్‌ నేరుగా రాజధాని ప్రాంతానికి వచ్చి.. బహిరంగ వేదికపై ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేశారు. బలవంతంగా రైతుల దగ్గర్నుంచి భూములు లాక్కోవద్దని.. అలాచేస్తే తాను చూస్తూ ఊరుకోనంటూ.. హెచ్చరించారు. ఆమేరకు ప్రభుత్వం సైతం ఒక మెట్టు దిగి వచ్చి భూసేకరణ ప్రయోగానికి స్వస్తిపలికింది.

తాజాగా... మంగళగిరి మండలం నవులూరు - ఎర్రబాలెం - కురగల్లు గ్రామాల రైతులు జనసేన బ్యానర్‌ లు - ఫ్లెక్సీలు కట్టడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌భుత్వం భూసేక‌ర‌ణ‌కు దూకుడుగా ముందుకు వెళుతున్న నేప‌థ్యంలో  బాధిత రైతులంతా జనసేన జెండా పట్టాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో పవన్‌ కల్యాణ్ ఫ్లెక్సీల‌తో హ‌డావుడి చేస్తున్నారు. తుళ్లూరు మండలంలో 300 ఎకరాలకు భూసేకరణ నోటిఫికేషన్‌ ను నవంబర్‌ మొదటివారంలో విడుదలచేస్తామని మంత్రులు ప్రకటించిన నేపథ్యం...ప‌వ‌న్ ఫ్లెక్సీలు అక్క‌డ ద‌ర్శ‌న‌మీయ‌డం మ‌రోమారు రాజ‌ధాని కేంద్రంగా రాజ‌కీయ వేడిని రాజేసింది..ఈ ద‌ఫా ఏ ప‌రిణామాల‌తో శుభం కార్డు ప‌డుతుందో చూడాలి మ‌రి.

Tags:    

Similar News