లాక్‌ డౌన్ నిబంధనలు సడలించాలి..మోదీని కోరిన సీఎం జగన్!

Update: 2020-04-11 11:12 GMT
కరోనా నేపథ్యంలో ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది. ఈ సందర్భంగా ప్రధానికి సీఎంలు తమతమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ ను పొడిగించడమే మంచిదని ఎక్కుమంది సీఎంలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా .. ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ - మీ నాయకత్వ లక్షణాలపై తమకు పూర్తి  విశ్వాసం ఉందని చెప్పారు. మీరు సూచించిన వ్యూహంతోనే ముందుకెళ్తామని తెలిపారు.

అలాగే , అదే సమయంలో ఆర్థిక వ్యవస్థ ముందుకు కదలాలన్నది తన అభిప్రాయమని మోడీకి తెలిపారు. కరోనాతో మనం సుదీర్ఘంగా పోరాటం చేయాలని తెలిపారు. రాష్ట్రంలో 141 కంటైన్ మెంట్ క్లస్టర్లను గుర్తించామని - లాక్ డౌన్ ను కొన్ని షరతులతో సడలించాలని సూచించారు. రెడ్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో లాక్ డౌన్ ను సడలించాలని - సినిమా హాల్స్ - మాల్స్ - స్కూళ్లను - ప్రజా రవాణాను మినహాయించి... మిగిలిన వాటిని లాక్ డౌన్ నుంచి మినహాయించాలని చెప్పారు.

రాష్ట్రంలో 1.4 కోట్లకు పైగా ఉన్న కుటుంబాలను - వారి ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పరిశీలిస్తున్నామని - కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వారికి పరీక్షలు చేసి - వారికి వైద్యం అందిస్తున్నామన్నారు. అలాగే, దాదాపు 30 వేల మంది వైద్య సిబ్బంది విధుల్లో ఉన్నారని తెలిపారు. దేశ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రధాని తీసుకుంటున్న ప్రతీ నిర్ణయాన్ని సమర్థిస్తున్నామని - ఆర్థిక వ్యవస్థ చక్రం పూర్తి వేగంతో ముందుకు కదలకపోయినా - కనీసం ప్రజల అవసరాలకు తగినట్టుగానైనా నడవాలన్న తమ అభిప్రాయమని సీఎం జగన్ మోదీ తో చెప్పుకొచ్చారు. 


Tags:    

Similar News