జగన్ దూరదృష్టి..కడప ఉక్కు నిర్మాణం ఆగదంతే

Update: 2019-12-24 07:35 GMT
వైసీపీ అధినేత - ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... సోమవారం తన సొంత జిల్లా కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాళ్లపల్లి వద్ద కడప ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. ఏపీ హైగ్రేడ్ స్టీల్ పేరిట ఈ ఫ్యాక్టరీకి పురుడుపోసిన జగన్... ఆ ఫ్యాక్టరీని నిర్ణీత కాల వ్యవధిలోనేగా పూర్తి చేసే దిశగా పకడ్బందీ ప్లాన్ తో ముందుకు సాగుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అసలే రాష్ట్రం అప్పుల్లో ఉండటమే కాకుండా... రాష్ట్రానికి పెద్దగా పరిశ్రమలు ఏమీ రాకపోయినా కూడా కడప ఉక్కుకు ఎలాంటి బ్రేకులు పడకుండా ఉండేాలా జగన్ తనదైన శైలి మంత్రాంగాన్ని రూపొందించారన్న వాదనలు కూడా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. వరల్డ్ బ్యాంకు సహా వివిధ పరిశ్రమలు ఇప్పటికే ఏపీ నుంచి తిరుగుముఖం పట్టినా కూడా కడప ఉక్కుకు మాత్రం ఎలాంటి అవరోధాలు కలగకుండా జగన్ మాస్టర్ ప్లాన్ వేసినట్లుగా వినిపిస్తున్న సదరు విశ్లేషణలు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి రూ.15 వేల కోట్లు అవసరమవుతాయని శంకుస్థాపన సందర్భంగా జగనే స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే కదా. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీ ప్రభుత్వం ఈ మేర నిధులను కడప ఉక్కుకు కేటాయించడం అంత వీజీ కాదు. మరి వేరే ఎవరైనా పారిశ్రామికవేత్తలు వచ్చి కడప ఉక్కు నిర్మాణ బాధ్యతలను తీసుకుంటారా? అంటే... రాజధానిపై ఏర్పడ్డ అనిశ్చితి, ఇప్పటిదాకా జరిగిన అభివృద్ధిపై విచారణలు జరుగుతున్న వేళ... పెట్టుబడిదారులు వచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదు. మరి ప్రభుత్వం వద్ద డబ్బుల్లేక - పెట్టుబడులు రాకపోతే... కడప ఉక్కును జగన్ ఎలా పూర్తి చేస్తారు? అది కూడా తాను పెట్టుకున్న మూడేళ్ల గడువులోగా జగన్ కడప ఉక్కును ఎలా పూర్తి చేస్తారు?

సరిగ్గా ఇక్కడే జగన్ తన చాతుర్యాన్ని చూపారని చెప్పాలి. 2030 నాటికి దేశ అవసరాలు తీరాలంటే... 3 కోట్ల టన్నుల ఉక్కు అవసరం. ఈ విషయం కేంద్రంలోని బీజేపీ సర్కారుకు కూడా తెలుసు. అందుకే... కడప ఉక్కుకు ముడిసరుకు ఇవ్వమని జగన్ అడగ్గానే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎన్ఎండీసీ నుంచి ఐరన్ ఓర్ ను సరఫరా చేసేందుకు మోదీ సర్కారు ఓకే చెప్పేసింది. అంతేకాకుండా... కడప ఉక్కుకు శంకుస్థాపన జరిగే నాటికే ఎన్ఎండీసీతో జగన్ సర్కారు ఒప్పందం కూడా పూర్తి అయిపోయేలా కేంద్రం వ్యవహరించింది. మొత్తంగా కడప ఉక్కుకు పునాది రాయి పడేలోగానే.. కేంద్రం నుంచి ముడిసరుకు సరఫరాకు జగన్ గ్రీన్ సిగ్నల్ వచ్చేలా చేసుకున్నారు. ఇక ఫ్యాక్టరీ నిర్మాణానికి అవసరమయ్యే నిధుల కోసం ఓ వైపు పెట్టుబడిదారుల కోసం యత్నిస్తూనే... మరోవైపు ప్రభుత్వమే నిధులు సమకూర్చుకునే వ్యూహానికి జగన్ పదును పెట్టారు. అదే సమయంలో భవిష్యత్తు అవసరాలను ఇప్పుడే చూపించి కేంద్రం నుంచి సానుకూలత వ్యక్తమయ్యేలా చేశారు. వెరసి... ఏ విధంగా అయినా కడప ఉక్కుకు కేంద్రం నుంచి ఇతోదికంగా సాయం అందే వ్యూహానికి జగన్ పదును పెట్టారు. సో... జగన్ మార్కు నిర్ణయంతో కడప ఉక్కుకు బ్రేకులు పడే అవకాశాలే లేవన్న మాట.


Tags:    

Similar News