రేపు శ్రీశైలానికి జగన్.. సాగునీటి రంగంలో కీలక పరిణామాలు..

Update: 2020-08-20 14:00 GMT
ఏపీ సీఎం జగన్ రేపు శ్రీశైలం ప్రాజెక్టు సందర్శనకు వెళుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం భారీ వర్షాలతో కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. కృష్ణా నది పరివాహకంలోని ప్రాజెక్టులన్నీ జలకళతో ఉట్టిపడుతున్నాయి. వరదనీటితో పోటెత్తుతున్నాయి. శ్రీశైలం గేట్లు కూడా ఎత్తి కిందకు నీరు విడుదల చేస్తున్నారు.

ఈ క్రమంలోనే సీఎం వైఎస్ జగన్ శుక్రవారం శ్రీశైలాన్ని సందర్శించబోతున్నారు. ఈ పర్యటనలో జగన్ వెంట జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు.

కాగా శ్రీశైలం ప్రాజెక్టు సందర్శన అనంతరం వైఎస్ జగన్ అక్కడే జలవనరుల శాఖ అధికారులతో కీలక సమావేశానికి సిద్ధమయ్యారు. పోతిరెడ్డిపాటు విస్తరణలో భాగంగా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభ పనులను జగన్ సమీక్షించడానికి రెడీ అయ్యారు.

కాగా రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్ల ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. సుభాష్ ప్రాజెక్ట్స్ మ్యాను ఫాక్చరర్స్ లిమిటెడ్ ఈ పనులను దక్కించుకున్న విషయం తెలిసిందే.దీనికి వర్క్ ఆర్డర్ ను కూడా జలవనరుల శాఖ అధికారులు జారీ చేశారు.

సీఎం జగన్ ఈ పర్యటనలో రాయలసీమ ఎత్తిపోతలను సమీక్షించి బిడ్డింగ్ వివరాలను తెలుసుకుంటారు. ఇక తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలపై వైఎస్ జగన్ ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

రాయలసీమ ఎత్తిపోతల పథకంను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రస్తుతం ఈ వివాదాలు అపెక్స్ కమిటీ వద్ద ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ సమీక్ష అనంతరం వైఎస్ జగన్ నేరుగా అపెక్స్ కమిటీ ముందుకు వెళ్లడానికి డిసైడ్ అయ్యారని సమాచారం. ఈ క్రమంలోనే జగన్ శ్రీశైలం పర్యటన ఆసక్తి రేపుతోంది.

    

Tags:    

Similar News