కాంగ్రెస్‌ కు ప‌రువు స‌మ‌స్య‌

Update: 2017-01-02 16:30 GMT
ఏ పార్టీని అయినా - ఎలాంటి నేత‌ల‌ను అయినా కలుపుకొనే మహాసముద్రం గుణమున్న కాంగ్రెస్‌ పార్టీకి ఏపీలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి ఎదురవుతోంది. రాష్ట్ర విభజన నిర్ణయంతో ఒక్కసారిగా సంక్షోభంలోకి నెట్టబడిన ఆ పార్టీకి రోజురోజుకు ఒడిదుడుగులు ఎదురవుతునే ఉన్నాయి. ఇప్పటికీ అప్పుడప్పుడు ఆ పార్టీ నుంచి నేతలు ఇతర పార్టీలకు వలసలు వెళ్లడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. రాష్ట్రంలో పార్టీ ఉనికికోసం పాట్లు పడుతున్న ఏపీ కాంగ్రెస్‌ నాయకత్వానికి ఇప్పుడు అధికార టీడీపీ - ప్రధాన ప్రతిపక్షం వైసీపీ నుంచి ఆపరేషన్‌ ఆకర్ష్‌ సవాల్‌ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీలోని అసంతృప్తి నేతలతోపాటు కాంగ్రెస్‌ లోని బలమైన నేతలకు గాళం వేయడం ప్రారంభించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం మున్ముందు ఆపరేషన్‌ ఆకర్ష్‌ను మరింత తీవ్రం చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇదే సందర్భంలో అధికారంలోనున్న టీడీపీ వ‌చ్చే ఎన్నికల్లో అన్ని ప్రతిపక్షాలను బలంగా ఎదుర్కోనేందుకు వీలుగా హస్తం పార్టీలో ఉండే సీనియర్లకు వలవేయాలని సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పార్టీ నేతల ముందు స్వయంగా చంద్రబాబు వెల్లడించడం విశేషం. దీంతో ఏపీ కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వంలో అలజడి మొదలైనట్లు తెలుస్తోంది. పార్టీలోని నేతలను నిలుపుకొనే దిశగా ప్రయత్నాలు ప్రారంభించాలని కాంగ్రెస్‌ పార్టీ అధినాయకత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఏం చేస్తే పార్టీ నేతల్లో, కార్యకర్తలో ఆత్మస్థైర్యం పెరుగుతోందన్న దానిపైనే కాంగ్రెస్‌ అధినాయకత్వం దృష్టిసారిస్తున్నట్లు సమాచారం.

కాంగ్రెస్‌ పార్టీ గతంలో ఎన్నడూ ఎదుర్కోని పరిస్థితులను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చవిచూడాల్సి వస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం సార్వత్రిక ఎన్నికలకు ముందే ఏపీలో కాంగ్రెస్‌ పార్టీలోని సీనియర్‌ నేతలు మెజార్టీగా ఆ పార్టీని వీడి టిడిపి - వైసిపిలోకి వలస వెళ్లారు. మరికొందరు పేరు మోసిన సీనియర్‌ నేతలు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీచేసి ఓడినా ఆ పార్టీలోనే కొంతకాలం కొనసాగారు. రాష్టవ్రి భజన నిర్ణయం వల్ల ఏపీ ప్రజలు ఇక కాంగ్రెస్‌ను అంగీకరించరేమోన్న భావన కలిగిన కొందరు నేతలు ఎన్నికల అనంతరం ఆ పార్టీని వీడి క్రమక్రమంగా ఇతర పార్టీలకు వలసవెళ్తున్నారు. దీంతో ఏపీ కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వంలో ఒక్కసారిగా అలజడి ప్రారంభమైంది. పార్టీ నుంచి ఒక్కోక్కరుగా నేతలు చేజారుతున్నా మొక్కవోని విశ్వాసంతో ఏపీ కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం ప్రజా పోరాటాలు ఉధృతం చేస్తూనే ఉంది. కానీ ప్రజల్లో ఓ వైపు పార్టీ నాయకత్వం దూసుకెళ్లి కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం చేస్తుంటే సీనియర్‌ నేతలు ఒక్కోక్కరుగా చేజారడం ఆ పార్టీకి కొంత ఆందోళన కలిగిస్తున్నట్లు సమాచారం. మరో రెండున్నరేళ్లలో సాధారణ ఎన్నికలు ఉన్నందున ఈ వలసల పరిణామమే తమ కొంప ముంచుతుందా అన్న ఆందోళన ఏపీ కాంగ్రెస్‌ నాయకత్వంలో మొదలైనట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో రాష్టవ్రిభజన పరిణామం కాంగ్రెస్‌ను ముంచితే ఇప్పుడు పేరున్న నేతలు చేజారడం శాపంగా మారొచ్చని ఆ పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికల్లో పార్టీకి విజయా వకాశాలు ఉంటాయా అన్న సందేహంతోపాటు ఒకవేళ మనం గెలిచినా మన పార్టీ ఒక చిన్న పార్టీగా సభలో ఉండిపోవాల్సి వస్తుందేమోనన్న ఆందోళన కూడా కాంగ్రెస్‌ పార్టీని నేతలు వీడటానికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నట్లు సమాచారం. వచ్చే సాధారణ ఎన్నికల్లో పార్టీ తరపున తాము గెలిచినా ఒక్కసారిగా తాము అధికారంలోకి వచ్చే పరిస్థితులు గానీ లేక ప్రధాన ప్రతిపక్షంగా గానీ బలమైన ప్రతిపక్షంగా గాని ఆవిర్భవించే పరిస్థితులులేవని కాంగ్రెస్‌ ను వీడిన నేతలు పేర్కొంటున్నారు. ఇదే అభిప్రాయం ఇంకా కాం గ్రెస్‌లో కొనసాగుతున్న నేతల్లో ఉండటమే ఈ వలసలకు కారణంగా కనిపి స్తోంది. ఈ విషయాన్ని ఏపీ కాంగ్రెస్‌ సీనియర్లు సైతం కొందరు ధృవీకరి స్తున్నారు. రాజకీయ భవిష్యత్‌ దిశగా భరోసా కల్పిస్తేనే పార్టీలో నేతలు కొనసాగే పరిస్థితి ఉందని కాంగ్రెస్‌ పార్టీలోని ఓ సీనియర్‌ నేత వ్యాఖ్యానించారు.

రాష్టవ్రిభజన కోపం ఇప్పుడిప్పుడే కాంగ్రెస్‌ పై నుంచి జనం లో తొలిగిపోతున్న తరుణంలో పార్టీ నేతల వలసలు ఆందోళనకు గురిచేస్తున్నాయని హస్తం పార్టీ నేతలు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో పార్టీకి రాజకీయ భవిష్యత్తు ఉంటుందన్న అభయం కల్పించినప్పుడే పార్టీ నేతలు పార్టీని వీడరని ఓ సీనియర్‌ నేత వ్యాఖ్యనించారు. అయితే పార్టీని ఎవరు వీడినా రాజకీయ అవకాశాల కోసం ఎదురుచూసే యువ నాయకత్వాన్ని కొత్త నాయకత్వాన్ని పార్టీలోకి తీసుకొంటే మాత్రం కచ్చితంగా పార్టీకి భవిష్యత్తు ఉంటుందని ఏపీ కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్తగా వచ్చే నాయకత్వం యువ నాయకత్వం పోరాటాలవైపు చురుగ్గా మొగ్గుచూపుతారని, ఆ పోరాటాల పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తాయని ఏపీ కాంగ్రెస్‌ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే రకమైన ఆదేశాలు ఏపీ కాంగ్రెస్‌ కు ఏఐసీసీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News