ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఈ మధ్యకాలంలో కాలం కలిసి రావడం లేనట్లుంది. ఉద్దేశం మంచిదయినా...చెడ్డదయినా ఫలితం మాత్రం భిన్నంగా ఉంటోంది. నవ్యాంద్రప్రదేశ్ ఏర్పడి ఏడాది అయిన నేపథ్యంలో రాజధాని విజయవాడ నుంచే కార్యకలాపాలు నిర్వహించాలని, అది తనతోనే ప్రారంభం కావాలని ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శ్రీకారం చుట్టారు. తన శాఖకు సంబంధించిన అన్ని కార్యాలయాలనూ త్వరితగతిని ఏపీ నూతన రాజధానికి తరలించడానికి కసరత్తు మొదలుపెట్టారు. సాగునీటి శాఖలోని 9 హెచ్‌వోడీ కార్యాలయాలను విజయవాడకు తరలించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ నేపథ్యంలో వచ్చే ఆదివారంలోపు తరలింపు ప్రక్రియ పూర్తి కావాలని సంబంధిత హెచ్‌వోడీలకు ఇంజనీర్ ఇన్ చీఫ్ లేఖలు రాశారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఉద్యోగుల కోణంలో ఈ సీన్ రివర్స్ అయి కూర్చుంది.
మంత్రి దేవినేని ఉమా నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. తమకు ఎటువంటి మౌలిక వసతులు కల్పించకుండా...నూతన రాజధానికి వెళ్లమంటే ఎలా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అతి తక్కువ సమయంలో విజయవాడ వెళ్లలేమని వారు చెబుతున్నారు. అంతేకాకుండా మంత్రి నిర్ణయానికి వ్యతిరేకంగా జలసౌధలో ఆందోళనకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి.
ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఏవిధంగా వ్యవహరిస్తారు..సర్కారు వారితో ఎలా ముందుకువెళుతుందో చూడాలి మరి.