అమూల్ తో జగన్ సర్కారు ఒప్పందం.. బాబుకు కొత్త వణుకు

Update: 2020-07-27 04:30 GMT
అమూల్  బ్రాండ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇదేమీ కార్పొరేట్ కంపెనీది కాదు. గుజరాత్ ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన ఈ కంపెనీ.. పాలు.. పాల ఉత్పత్తుల్లో అంతకంతకూ ఎదుగుతోంది. పాలకు సంబంధించిన దేశీయంగా తిరుగులేని బ్రాండ్ ఏమైనా ఉందంటే.. అమూల్ పేరును చాలామంది ప్రస్తావిస్తారు. టీవీల్లో తరచూ.. ‘అమూల్ పాలు.. తాగుతోంది ఇండియా’ అంటూ వచ్చే యాడ్ అందరిని ఆకట్టుకుంటుంది. ఇప్పుడు అదే అమూల్.. టీడీపీ అధినేత చంద్రబాబు గుండెల్లో బండలా మారిందని చెబుతున్నారు.

బాబు ఇంట్లో అమూల్ కొత్త చిచ్చు రేపినట్లుగా చెబుతున్నారు. అమూల్ తో ఏపీ సర్కారు ఒప్పందం చేసుకున్న వైనం బాబుకు కొత్త సవాల్ గా మారింది. మామూలుగా అయితే.. ప్రభుత్వం ఏదైనా ఒప్పందం చేసుకున్నంతనే దాన్ని రాజకీయం చేయొచ్చు. రచ్చకు అవకాశం ఉంటుంది.కానీ.. అమూల్ కత వేరు. అదో ప్రభుత్వ రంగ సంస్థ కావటం.. దాని మీద నిందలు వేయలేని పరిస్థితి. ఇంతకీ అమూల్ తో ఏపీ సర్కారు ఒప్పందం చేసుకుంటే బాబు గుండెల్లో బండ పడాల్సిన అవసరం ఏముందంటారా? ఆయన కుటుంబానికి సంబంధించిన హెరిటేజ్ ను మర్చిపోకూడదు.

బాబు జమానాలో ప్రభుత్వ కార్యకలాపాల్లో హెరిటేజ్ ఉత్పత్తుల సరఫరా భారీగా ఉండేది. చంద్రన్న సంక్రాంతి కానుక.. రంజాన్ తోఫా సందర్భాల్లో ప్రజలకు ఇచ్చే కిట్లలో వాడే వస్తువుల్లో హెరిటేజ్ వి ఎక్కువన్నది మర్చిపోకూడదు. హెరిటేజ్ రేంజ్ పెంచేందుకు పలు డెయిరీల ఉసురును బాబు తీశారన్న విమర్శ తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అమూల్.. ఏపీ సర్కారు మధ్య జరిగిన ఒప్పందం హెరిటేజ్ మీద భారీ ప్రభావాన్ని చూపిస్తుందని చెబుతున్నారు.

మిగిలిన కంపెనీలతో డీల్ చేసుకుంటే మరోలాంటి పరిస్థితి ఉండేది. అలాంటి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వ రంగ సంస్థతో జగన్ సర్కారు డీల్ కుదుర్చుకోవటం ద్వారా ఎవరూ వేలెత్తి చూపించాల్సిన అవసరం ఉండదు. అదే సమయంలో.. రాజకీయంగా బాబుకు దిమ్మ తిరిగిపోయేలా షాకివ్వొచ్చు. ఈ కారణంతోనే అమూల్ తో ఒప్పందానికి జగన్ ఓకే చెప్పినట్లుగా చెబుతున్నారు. ఏపీలో అధికారం కోల్పోయిన నాటి నుంచి హెరిటేజ్ పరిస్థితి పెద్ద బాగోలేదన్న మాట వినిపిస్తోంది. వాస్తవానికి 2014 ఎన్నికలకు ముందే హెరిటేజ్ లోని వాటాను ఫ్యూచర్ గ్రూపుకు అమ్మారు. అయితే.. పాలు.. పాల ఉత్పత్తుల వ్యాపారాన్ని మాత్రం బాబు ఫ్యామిలీనే చూస్తోంది. అమూల్ తో నేరుగా చేసుకున్న ఒప్పందం హెరిటేజ్ మీద తీవ్ర ప్రభావాన్ని చూపటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. చూస్తుంటే.. బాబుకు దెబ్బేస్తూ.. అదే సమయంలో తన మీద ఎలాంటి విమర్శలు రాకుండా జగన్ వేసిన ప్లాన్ తిరుగులేనిదన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News