ఏపీ మైండ్ సెట్ మారిపోయిందా?

Update: 2015-09-28 09:39 GMT
చంద్ర‌బాబు నోట్లో నుంచి వ‌చ్చిన రెండు క‌ళ్ల సిద్ధాంతం కార‌ణంగా సీమాంధ్రుల‌కు ఎంత న‌ష్టం వాటిల్లిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. రెండు ప్రాంతాల‌ను స‌మానంగా చూడాల‌ని.. వారిద్ద‌రికి ఎలాంటి న‌ష్టం వాటిల్ల‌కుండా నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెప్పేవారు. అవ‌స‌ర‌మైతే ఈ అంశంపై తాను పోరాటం కూడా చేస్తాన‌ని చెప్పుకునే వారు.

తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలోనే కాదు.. విభ‌జ‌న అనంత‌రం.. ఏపీ ముఖ్య‌మంత్రి వ్య‌వ‌హ‌రిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల గురించి ప్ర‌స్తావించ‌టం.. దాని కోసం కొన్నివిష‌యాల్లో వెన‌క్కి త‌గ్గ‌టం లాంటివి చేసేవారు. ఏపీ ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న బాబు నోటి నుంచి తెలంగాణ అనుకూల మాట రావ‌టం సీమాంధ్రుల‌కు ఏ మాత్రం న‌చ్చేది కాదు. ఈ విష‌యాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోన‌ట్లుగా ఏడాది గ‌డిపిన చంద్ర‌బాబుకు ఓటుకు నోటు.. ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారాలు పెద్ద షాకింగ్ గా మారాయి.

ఈ ఎపిసోడ్ త‌ర్వాత హైద‌రాబాద్ లో ఉండ‌టం ఏ మాత్రం సుర‌క్షితం కాద‌ని తేలిన అనంత‌రం.. బాబు బెజ‌వాడ‌కు వెళ్లిపోయారు. ఇది మొద‌లు.. ఏపీ నిర్ణ‌యాల్లో క‌చ్ఛిత‌త్వంతో పాటు.. తెలంగాణ స‌ర్కారు విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రించ‌ట‌మే కాదు.. ఏ విష‌యంలోనూ వెన‌క్కి త‌గ్గ‌కూడ‌ద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తోంది.

తెలంగాణ విద్యుత్తు సంస్థ‌ల నుంచి ఏపీ మూలాలు ఉన్న‌ట్లుగా చెబుతూ దాదాపు 1200 పైగా విద్యుత్తు ఉద్యోగుల్ని టోకుగా రిలీవ్ చేస్తూ తెలంగాణ స‌ర్కారు నిర్ణ‌యం తీసుకుంది. వీరికి అపాయింట్ మెంట్ ఇచ్చేందుకు ఏపీ స‌ర్కారు స‌సేమిరా అన‌ట‌మే కాదు.. కేంద్రం.. సుప్రీం కోర్టుల‌ను ఆశ్ర‌యించింది. చివ‌ర‌కు ఈ వివాదానికి సంబంధించి రాష్ట్ర హైకోర్టు ఈ మ‌ధ్య‌నే ఒక తీర్పు ఇచ్చింది. దీని ప్ర‌కారం.. తెలంగాణ స‌ర్కారు రిలీవ్ చేసిన ఉద్యోగులకు సంబంధించి వారి జీతాల్లో 58 శాతం ఏపీ.. 42 శాతం తెలంగాణ స‌ర్కారు చెల్లించాల‌ని.. బ‌కాయిలు కూడా వెంట‌నే ఓకే చేయాల‌నే మాట‌ను చెప్పింది.

దీనికి తెలంగాణ స‌ర్కారు స‌రేన‌ని చెప్పేంది. నిజానికి ఇలాంటి పంచాయితీలు తెర‌పైకి వ‌స్తే.. ఏపీ స‌ర్కారు చూసీచూడ‌న‌ట్లుగా.. తెలంగాణ స‌ర్కారు క‌చ్ఛితంగా వ్య‌వ‌హ‌రించ‌టం ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న అనుభవం.దీనికి భిన్నంగా తాజా విద్య‌త్తు ఉద్యోగుల విష‌యంలో జీతాలు ఇచ్చేందుకు తెలంగాణ స‌ర్కారు ఓకే చెబితే.. ఏపీ స‌ర్కారు మాత్రం దీనిపై సుప్రీంకు వెళ్లాల‌ని నిర్ణ‌యించిన‌ట్లుగా చెబుతున్నారు. తెలంగాణ క్యాడ‌ర్ కు చెందిన ఉద్యోగుల‌కు తాము జీతాలెలా ఇవ్వాల‌ని వారు ప్ర‌శ్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇలా తెలంగాణ‌.. ఏపీ ప్ర‌భుత్వ పంచాయితీల‌తో విద్యుత్తు ఉద్యోగుల ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా సాగుతోంది. నెల‌ల త‌ర‌బ‌డి జీతాల్లేక ఇబ్బంది పడుతున్న విద్యుత్తు ఉద్యోగులు ఏపీ సీఎం తీసుకున్న నిర్ణ‌యంపై దిగాలు చెందుతున్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల క్షేమం గురించి మాట్లాడే చంద్ర‌బాబు.. ఇప్పుడు మాత్రం అస‌లుసిస‌లు ఏపీ ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News