టార్గెట్ బాబు...ఏపీ ఉద్యోగుల్లో చీలిక

Update: 2017-02-06 07:09 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉద్యోగుల ఐక్య సంఘంలో చీలిక వ‌చ్చింది.  ఏపీ ఎన్‌ జిఓల సంఘం అధ్యక్షుడు అశోక్‌ బాబు తీరును నిర‌సిస్తూ 73 ఉద్యోగ సంఘాలు సమావేశం ఏర్పాటు చేసుకుని ఏపీ నూతన జేఏసీకి శ్రీకారం చుట్టాయి. 13 జిల్లాల నుంచి వివిధ శాఖలకు సంబంధించిన అధ్యక్ష - కార్యదర్శులు - ఉద్యోగులు పెద్దఎత్తున తరలివచ్చారు. నూతన జేఏసీ ఆవిర్భావ సమావేశానికి వందల సంఖ్యలో వస్తారని నిర్వాహకులు భావించారు. అయితే వేల సంఖ్యలో ఉద్యోగులు, సంఘాల నేతలు - మహిళలు తరలిరావడం అశోక్ బాబు వ్య‌తిరేక‌త‌ను చాటింది. ఉద్యోగ సంఘాల నూతన జేఏసీ చైర్మన్‌ గా ఎన్నికైన బొప్పరాజు వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ అశోక్ బాబు ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకుండా ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తున్నందున ఉద్యోగ సంఘాలు నూతన జేఏసీ ఏర్పాటు చేసుకున్నాయ. అశోక్‌బాబు ఏకపక్షంగా వ్యవహరించడంతోపాటు ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించానికి సిద్ధంగా ఉన్నా సైంధవుడిలా అడ్డుపడి జేఏసీ లక్ష్యాన్నే భ్రష్టు పట్టించారని అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేసిన‌ప్ప‌టికీ అశోక్ బాబు ముందుకు సాగ‌క‌పోవ‌డంతో తన వద్దకు వచ్చి నూతన జేఏసిని పెట్టాలని కోరారని బొప్ప‌రాజు అన్నారు. అందుకే ఈ వేదిక ఆరంబించామ‌ని వివ‌రించారు. తాను ఎమ్మెల్సీ పదవి కోరానని, అది కాదన్నందుకే నూతన జెఏసి ఏర్పాటు చేస్తున్నట్లు తప్పడు ప్రచారం చేస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. తనకలాంటి కోరికలు లేవని, తన స్థాయి ఏమిటో తనకు తెలుసన్నారు. ఉద్యోగ సంఘ నేతలను బెదిరించే ధోరణి విడనాడాలని ఆయన అశోక్‌ బాబుకు హితవు పలికారు. రాష్ట్రంలో రెండు జేఏసీలు ఉన్నట్లేనా? అని ప్రశ్నించినప్పుడు ఇక్కడ ఏర్పడిన జేఏసీ తలుపులు గడియపెట్టుకుని ఏర్పాటైంది కాదని, బహిరంగంగా-స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఏర్పాటు చేసుకున్న జేఏసీ అన్నారు. ఇదే నిజమైన జేఏసీ అన్నారు. ప్రత్యేక హోదాపై ఉద్యమించేందుకు అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయన్నారు. ఇప్పుడు కూడా కేంద్రం, రాష్ట్రానికి ఏమైతే హామీలిచ్చిందో వాటిని నెరవేర్చుకోవడానికి రాజకీయ పార్టీలు ఎంతో ప్రయత్నిస్తున్నాయని వారు విఫలమైతే ప్రజల కోసం పోరాడతామన్నారు.కాగా, నూతన జేఏసీ ఏర్పాటు అట్టహాసంగా సాగింది. ముందుగా ఉద్యోగ సంఘాల నేతల ఆధ్వర్యంలో తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా బొప్పరాజకు మద్దతు పలకడంతోపాటు ఆయన నాయకత్వానికి మద్దతు పలుకుతూ నినాదాలు చేశారు. జేఏసీ చెర్మన్‌ గా బొప్పరాజు పేరును రాష్ట్ర ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు సూర్యనారాయణరాజు ప్రతిపాదించారు. ఇందుకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News