కేసీఆర్ ఓడిన చోటే బాబు గెలిచారు

Update: 2015-10-24 05:02 GMT
కేసీఆర్...తాను అనుకుంటే ఆరునూరైనా స‌ద‌రు ప‌ని అమ‌లుచేసే వ‌ర‌కు వ‌దిలిపెట్ట‌ని మొండి మ‌నిషి. అలాంటి కేసీఆర్ ఓ విష‌యంలో త‌న ఆకాంక్ష‌ను త‌లొగ్గాల్సి వ‌చ్చింది. అయితే సేమ్ టు సేమ్ అదే ప‌నిని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చేసి చూపించారు. ప్రాణాలు తీస్తున్న గుడుంబా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించడానికి అంటూ తెలంగాణలో ప్రభుత్వం త‌ర‌ఫునే చౌకమద్యాన్ని తీసుకురావాలని కేసీఆర్ ప్రయత్నించారు.  అయితే కాంగ్రెస్‌ - టీడీపీ - బీజేపీ తదితర విపక్షాలన్నీ ఏక‌మ‌వ‌డంతో పాటు తెలంగాణ ప్రజలలో మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. దీంతో చీప్‌ లిక్కర్‌ పై తెలంగాణ సర్కార్ తన ఆలోచనను తాత్కాలికంగా వాయిదా వేసుకోవలసి వచ్చింది.

అయితే ఇపుడు ఏపీలో చీప్‌ లిక్కర్‌ కు ద్వారాలు బార్లా తెరవాలని చంద్రబాబు సర్కారు నిర్ణయించింది. రూ.30కే క్వార్టర్ బాటిల్ ఇవ్వాలని సంకల్పించింది. అంటే రూ.10కే ఒక పెగ్గన్నమాట. ఈ మేర‌కు ఆదేశాలు జారీచేసింది. మ‌రోవైపు ఈ విధంగా రంగుసారా తయారీకి పచ్చజెండా ఊపడంతోపాటు ఫారిన్‌ లిక్కర్ ధరలను భారీగా పెంచాలని డిసైడ్ అయిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ ధరకు చీప్ లిక్కర్‌ ను అందుబాటులోకి తెస్తూ ఈ నెల 21న ఉత్తర్వులు విడుదలయ్యాయి.

విలువ ఆధారిత పన్ను (వ్యాట్), ఎక్సైజ్ డ్యూటీని ప్రభుత్వం బాగా తగ్గించింది. రూ. 350 - రూ. 400 కేటగిరీలను కొత్తగా తీసుకువస్తూ, మద్యంపై అతి తక్కువ పన్ను వేసేలా నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై ఆంధ్రాలో చౌకమద్యం అందుబాటులోకి రానుంది. రూ.400 ధర పైచిలుకు ఉన్న మద్యం కేస్(పన్నెండు బాటిళ్ల కాటన్)పై వ్యాట్‌ ను190 శాతానికి  - రూ.400 లోపు ధర ఉండే మద్యంపై వ్యాట్‌ ను 140 శాతానికి పరిమితం చేసింది. ఈ నిర్ణయంతో క్వార్టర్ బాటి ల్ చీప్‌ లిక్కర్ రూ.30లోపే ఉంటుందని అధికారులు చెప్తున్నారు. దీనితో చీప్‌ లిక్కర్ ధరలు భారీగా తగ్గుతుండగా, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్‌ తో పాటు విదేశీ మద్యం ధరలు గణనీయంగా పెరుగనున్నాయి.

మొత్తంగా చీప్ లిక్క‌ర్ విష‌యంలో కేసీఆర్ ఓడిన చోటే బాబు గెలిచి చూపించారు!. అయితే చీప్ లిక్క‌ర్ ప్ర‌భావం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే మ‌రి.
Tags:    

Similar News