పోలవరం రివర్స్ టెండరింగ్ పీక్స్ కు..వాట్ నెక్ట్స్?

Update: 2019-08-20 07:04 GMT
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి రివర్స్ టెండరింగ్ వ్యవహారం పై రచ్చ పతాక స్థాయికి చేరినట్టుంది. రివర్స్ టెండరింగ్ కు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. గత కాంట్రాక్టర్లకు  చంద్రబాబు నాయుడి ప్రభుత్వం అయాచిత లబ్ధి చేకూర్చిందని - కనీసం నిర్మాణాలు కూడా చేపట్టకుండానే అడ్వాన్స్ లు ఇచ్చిందని - భారీ ఎత్తున కమిషన్లు తీసుకుని అప్పటి ప్రభుత్వ పెద్ద పోలవరం వ్యవహారాన్ని వాడుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతూ వచ్చింది. ఈ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే రివర్స్ టెండరింగ్ కు రంగం సిద్ధం చేసింది.

అందుకు సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇప్పటికే విడుదల అయ్యింది. ఇలాంటి నేపథ్యంలో ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందన ఆసక్తిదాయకంగా మారింది. రివర్స్ టెండరింగ్ కు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఉందనే వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన ఏదీ రాలేదు.

కానీ ఈ మొత్తం వ్యవహారంపై నివేదికను ఇవ్వాలని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి కేంద్ర జలవనరుల శాఖ నుంచి ఆదేశాలు వచ్చినట్టుగా తెలుస్తోంది. రివర్స్ టెండరింగ్ కు ఎలాంటి పరిస్థితులు దారి తీశాయి? అనే అంశం గురించి కూలంకుషమైన వివరణను కోరుతూ ఉందట కేంద్రం.

మరి ఆ వివరణతో కేంద్రం సంతృప్తి చెందుతుందా? రివర్స్ టెండరింగ్ వద్దే వద్దని అంటుందా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ప్రాజెక్టు నిర్మాణంలో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుందని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తూ ఉంది. రివర్స్ టెండరింగ్ తో డబ్బులు ఆదా కావడమే తప్ప ఎక్కువ కావడం ఉండదని అంటోంది. అయితే రివర్స్ టెండరింగ్ తో అదనపు డబ్బులు ఖర్చయితే తమకు సంబంధం లేదన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం వాదిస్తోందట. అలాగే రివర్స్ టెండరింగ్ వల్ల కాలయాపన జరుగుతుందని కూడా అంటున్నారట కేంద్ర ప్రభుత్వ పెద్దలు. ప్రస్తుతానికి అయితే పీపీఏ నుంచి నివేదికను కోరుతున్నారు. ఆ నివేదికలో ఏం పేర్కొంటారు? ఈ అంశంపై తదుపరి ఏం జరుగుతుందో ముందు ముందు తెలిసే అవకాశం ఉంది.

Tags:    

Similar News