ఈ బుద్ధి ముందే ఉంటే?: 10వేల ఎక‌రాలు వ‌ద్దంట‌

Update: 2015-06-22 10:10 GMT
విమ‌ర్శ‌లు రాకుండా పాల‌న చేయ‌టం క‌ష్ట‌మే. కానీ.. ఆరోప‌ణ‌ల మ‌కిలి అంటకుండా పరిపాల‌న అసాధ్య‌మేమీ కాదు. ఈ విష‌యాన్ని ప‌దేళ్లు ప్ర‌తిపక్ష నేత‌గా ఉన్న.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు చెప్పాల్సిన దుస్థితి. తొమ్మిదిన్న‌రేళ్ల ముఖ్య‌మంత్రిగా ఉన్న కాలం కంటే కూడా.. ప‌దేళ్లు ప్ర‌తిప‌క్ష నేత‌గా వ్య‌వ‌హ‌రించిన కాలంలో చంద్ర‌బాబు చాలానే పాఠాలు నేర్చుకున్నారు.
అలాంటి ఆయ‌న‌.. నీతి.. నిజాయితీకి.. పార‌ద‌ర్శ‌క‌త‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా చెప్పుకునే ఆయ‌న‌.. కొన్ని నిర్ణ‌యాల విష‌యంలో చిన్న పిల్లాడి చేత కూడా వేలెత్తి చూపించేలా వ్య‌వ‌హ‌రించ‌టం గ‌మ‌నార్హం. 

సుదీర్ఘ‌కాలం త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన నేప‌థ్యంలో.. త‌ప్పులు జ‌ర‌గ‌కుండా.. ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఏర్ప‌డ‌కుండా ఆచితూచి నిర్ణ‌యాలు తీసుకోవాల్సిన స్థానే.. అత్యుత్సాహంతో తీసుకున్న ఒక నిర్ణయాన్ని తాజాగా వెన‌క్కి తీసుకున్నారు. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురం వ‌ద్ద నిర్మించాల‌ని భావిస్తున్న ఎయిర్ పోర్ట్‌కు సంబంధించి ఏపీ స‌ర్కారు ఒక భారీ నిర్ణ‌యం తీసుకుంది. ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కోసం దాదాపు 15వేల ఎక‌రాల భూమిని సేక‌రించాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌టం తెలిసిందే.

దీనిపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఎయిర్‌పోర్ట్ కోసం అంత భారీ స్థాయిలో భూమి అవ‌స‌రం ఏమిట‌న్న ప్ర‌శ్న ప‌లువురు వ్య‌క్తం చేసిన ప‌రిస్థితి. ఇక‌.. రైతులు అయితే ఎయిర్ పోర్ట్ కోసం వేలాది ఎక‌రాలు సేక‌రించాల‌న్న బాబు స‌ర్కారు నిర్ణ‌యాన్ని తీవ్రంగా వ్య‌తిరేకించారు. వీరికి విప‌క్షాలు గొంతు క‌ల‌ప‌టంతో పాటు.. అస‌లు ఎయిర్ పోర్ట్ కు అన్నివేల ఎక‌రాల అవ‌స‌రం ఏమిట‌న్న ప్రాధ‌మిక ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌లేక త‌మ్ముళ్లు నీళ్లు న‌మిలే ప‌రిస్థితి.

ఈ వ్య‌వ‌హారంలో ఇలానే ముందుకెళితే ప్ర‌మాదం అనుకున్నారేమోకానీ.. తాజాగా ఎయిర్ పోర్ట్ కోసం 5040 ఎక‌రాలు స‌రిపోతుంద‌ని ప్ర‌క‌టించారు. ఈ విష‌యాన్ని మంత్రి మృణాళిని కూడా క‌న్ఫ‌ర్మ్ చేశారు. ఒక్క‌సారిగా ప‌దివేల ఎక‌రాల భూమి అవ‌స‌రం లేద‌ని ఏపీ స‌ర్కారు చెప్ప‌టం.. ఇప్ప‌టివ‌ర‌కూ ఈ వ్య‌వ‌హారాన్ని వ్య‌తిరేకించిన వారికి నైతిక స్థైర్యాన్ని ఇవ్వ‌ట‌మే కాదు.. వారిలో ఏపీ స‌ర్కారు నిర్ణ‌యాల‌పై మ‌రింత విరుచుకుప‌డేందుకు అవ‌కాశాన్ని ఇచ్చాయ‌ని చెబుతున్నారు.
మ‌రోవైపు.. ఎయిర్ పోర్ట్‌కి ఐదు వేల ఎక‌రాలు కూడా అవ‌స‌రం లేద‌న్న మాట వినిపిస్తోంది. మొత్తానికి భోగాపురం ఎయిర్ పోర్ట్ శంకుస్థాప‌న స‌మ‌యానికి మ‌రెన్ని సిత్రాలు చోటు చేసుకుంటాయో..?
Tags:    

Similar News