తెలంగాణ‌లో అలా.. ఏపీలో ఇలా ఏంటి త‌మ్ముళ్లు?

Update: 2015-07-17 09:17 GMT
ఏపీ అధికార‌ప‌క్షం కొత్త చిక్కుల్లో ప‌డింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మున్సిప‌ల్ కార్మికులు త‌మ జీతాలు పెంచాలంటూ ఆందోళ‌న చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణ‌లో గ్రేట‌ర్ పారిశుద్ధ్య కార్మికుల‌కు 47శాతం జీతం పెంచుతూ తెలంగాణ స‌ర్కారు గురువారం సాయంత్రంనిర్ణ‌యం తీసుకోవ‌టం తెలిసిందే. అయితే.. ఈ పెంపు గ్రేట‌ర్‌కు ప‌రిమితం కావ‌టం.. తెలంగాణ‌లోని మిగిలిన ప్రాంతాల‌కు వ‌ర్తింపు చేయ‌క‌పోవ‌టంపై కార్మికులు తీవ్ర అగ్ర‌హంగా ఉన్నాయి.

వారికి మ‌ద్ధ‌తుగా కాంగ్రెస్‌.. తెలుగుదేశం.. బీజేపీ.. వామ‌ప‌క్షాలు అన్నీ ఆందోళ‌న‌లో పాల్గొంటున్నాయి. కార్మికుల‌కు మ‌ద్ధ‌తుగా నిలిచి.. తెలంగాణ అధికార‌ప‌క్షం వైఖ‌రిని నిల‌దీస్తున్నాయి. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. తెలంగాణ‌లో కార్మికుల‌కు అండ‌గా నిలిచిన తెలుగుదేశం పార్టీ.. ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తోంది.

ఏపీలో అధికార‌ప‌క్షంగా ఉన్న టీడీపీ.. మున్సిప‌ల్ కార్మికుల డిమాండ్ల విష‌యంలో ఇప్ప‌టివ‌ర‌కూ స్పందించింది లేదు. వారి ఆందోళ‌న‌ల్ని అస్స‌లు ప‌ట్టించుకోవ‌టం లేదు. దీంతో.. ప‌ద‌మూడు జిల్లాల‌కు చెందిన కార్మికులు.. మ‌హిళ‌ల‌తో స‌హా విజ‌య‌వాడ‌లో ఆందోళ‌న‌కు దిగారు. ఈ సంద‌ర్భంగా ఏపీ స‌ర్కారుకు వ్య‌తిరేకంగా వారు నినాదాలు చేశారు.

ఈ సంద‌ర్భంగా పోలీసుల‌కు..కార్మికులకు మ‌ధ్య తీవ్ర ఉద్రిక‌త్త‌త చోటు చేసుకుంది. తోపులాట భారీగా చోటు చేసుకోవ‌టంతో ప‌లువురు కార్మికుల‌కు గాయాల‌య్యాయి. తెలంగాణ‌లో అధికార‌ప‌క్షంపై నిప్పులు చెరుగుతున్న తెలుగుత‌మ్ముళ్లు.. త‌మ పార్టీ అధికారంలో ఉన్న ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా మౌనంగా ఉంటున్నారు. అంటే.. రాష్ట్రానికి త‌గ్గ‌ట్లుగా న్యాయం మారిపోతుందా?

తెలంగాణ‌లో కార్మికుల డిమాండ్లు స‌హేతుక‌మ‌ని వాదించే త‌మ్ముళ్లు.. ఏపీలో కూడా ఆ మాట‌ను ఎందుకు చెప్ప‌లేక‌పోతున్నారు?  రెండు రాష్ట్రాల్లో రెండు ర‌కాలుగా వ్య‌వ‌హ‌రించ‌టం తెలుగు త‌మ్ముళ్ల‌కు మాత్ర‌మే సాధ్య‌మేమో..!
Tags:    

Similar News