ఇప్పుడే: ఏపీలో భూసేకరణ చట్టం జారీ చేశారు

Update: 2015-08-21 05:32 GMT
ఏపీలో కొత్త రణం మొదలు కానుంది. ఏపీ రాజధాని నిర్మాణం కోసం చేపట్టిన భూసమీకరణలోని రెండో దశ మొదలు కానుంది. రాజధాని నిర్మాణం కోసం రైతులు తమ భూములు ఇవ్వాలన్న పిలుపునకు స్పందించని రైతుల నుంచి బలవంతంగా అయినా భూమిని సేకరించేందుకు వీలుగా.. భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని ఏపీ సర్కారు నిర్ణయించింది.

రాజధాని కోసం భూములు ఇవ్వటానికి ఇష్టపడని రైతుల్ని వదిలేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే పలుమార్లు ఏపీ సర్కారును కోరారు. భూసేకరణ చట్ట ప్రయోగంపై విపక్షాలు సైతం మండిపడుతున్నాయి. రాజధాని నిర్మాణం కోసం దాదాపు 30వేల ఎకరాల్ని ఎలాంటి ఇబ్బందల్లేకుండా సేకరించిన ఏపీ సర్కారుకు.. భూసేకరణ చట్టం ద్వారా సేకరించాలని భావిస్తున్న 3,892 ఎకరాల విషయంలో భారీ తలనొప్పులు ఖాయమన్న వాదన వినిపిస్తోంది.

ఏది ఏమైనా అనుకున్న సమయానికి శంకుస్థాపన చేయాలన్నా.. రాజధాని నిర్మాణాన్ని మొదలు పెట్టాలన్నా.. మాస్టర్ ప్లాన్ లో పేర్కొన్న విధంగా భూమిని మొత్తం సేకరించాల్సి ఉంటుందని ఏపీ సర్కారు భావిస్తోంది. ఇందుకుతగ్గట్లే.. శుక్రవారం ఉదయం భూసేకరణ చట్టాన్ని ఏపీ రాజధాని భూముల సేకరణ కోసం ప్రయోగించేలా ఏపీ సర్కారు నోటిఫికేషన్ జారీ చేసింది.

జీవో 304 పేరిట జారీ అయిన ఈ జీవోలో అమరావతి పరిధిలోని తుళ్లూరు(2).. శాకమూరు.. బోరుపాలెం.. పిచుకల పాలెం.. అంతవరం.. నేలపాడు.. ఐనవోలు.. అబ్బురాజుపాలెం.. దొండపాలెం.. కొండమరాజుపాలెం రెవెన్యూ గ్రామాలున్నాయి.

ఈ గ్రామాల పరిధిలోని 3,892 ఎకరాల్ని సేకరించేందుకు మొత్తంగా 26 మంది స్పెషల్ కలెక్టర్లను రంగంలోకి దించుతోంది. మరో 19 గ్రామాలకు సంబంధించిన భూసేకరణ నోటిఫికేషన్ ను శనివారం జారీ చేయాలని భావిస్తోన్నట్లు చెబుతున్నారు. ఇప్పటివరకూ భూసమీకరణతో పెద్దగా ఇబ్బందుల్లేకుండా.. సాగిపోయిన భూసేకరణ.. తాజాగా చట్టప్రయోగంతో రైతులకు ఇష్టం లేకుండా స్వాధీనం చేసుకోవటం ఆయా గ్రామాల్లో అగ్రహాం వ్యక్తమవుతోంది. దీంతో.. ఏపీ రాజకీయం ఒక్కసారి వేడెక్కిందన్న భావన వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News