రాజధాని రోడ్లు చాలా కాస్ట్ లీ గురూ..!

Update: 2017-09-01 07:39 GMT
అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మిస్తామంటున్న రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా ప్రకటనలకే పరిమితమైందన్న వాద‌న వినిపిస్తోంది. రోజుకో దేశం పేరుతో ఏళ్లకేళ్లు రాజధాని నిర్మాణం సినిమా మారిదిగానే సాగుతోంద‌న్న ఆరోప‌ణ లేకపోలేదు. బాహుబలిని మించిపోయే  గ్రాఫిక్స్‌ తో డిజైన్లు వెలువడటమే తప్ప.. ఒక్క పనీ ఇంత వరకూ ప్రారంభం కాని వైనం క‌నిపిస్తూనే ఉంది. సింగపూర్‌ - మలేసియా పేర్లు చెబుతూనే మూడేళ్లు గడిసిపోయాయి. ఈ తతంగానికి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తినా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. ఇవన్నీ ఒక ఎత్తైతే.. చంద్రబాబు సర్కార్‌‌ తాజాగా తీసుకున్న నిర్ణయం నిపుణులనే అవాక్కయ్యేలా చేస్తోంది.

నూతన రాజధానిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏ పనులకైనా చుక్కలనంటేలా భారీ అంచనాలను రూపొందిస్తోంది. తాత్కాలిక రాజధాని నిర్మాణంలో ఇష్టారీతిన చదరపు అడుగుకు 6,020 రూపాయలు ఖర్చుచేసిన సర్కారు.. ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు - ఐఏఎస్‌ ల నివాస ప్లాట్లకు ఏకంగా ఒక్కో ప్లాట్‌ కు 1.40 కోట్ల రూపాయలను అంచనాగా పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా తాత్కాలిక సచివాలయం నుంచి ప్రభుత్వ భవనాల శాశ్వత నిర్మాణాల వరకు సబ్‌ ఆర్టీరియల్‌ (ఎక్కువ ట్రాఫిక్‌ సామర్థ్యం) రహదారుల నిర్మాణాలకు అమరావతి డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ (ఏడీసీ) అదే రీతిలో అంచనాలు తయారు చేసింది. వర్షం నీరు - విద్యుత్‌ కేబుల్ - మంచినీటి పైపులతో సహా 98.77 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రహదారుల నిర్మాణానికి ఏకంగా రూ.1520.28 కోట్ల అంచనాగా రూపొందించింది.

ఇక  ఈ రహదారుల నిర్మాణాలకు ఇంజినీరింగ్‌ ప్రొక్యూర్‌ మెంట్‌ అండ్‌ కన్‌ స్ట్రక్షన్‌ (ఈపీసీ)లో మూడు ప్యాకేజీలుగా టెండర్లు పిలిచింది. ఈ రహదారుల అంచనాలను చూసి అధికార వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. సాధారణంగా నాలుగు లేన్ల జాతీయ రహదారులకు కిలోమీటర్‌ కు (సర్వీసు రోడ్లతో సహా) మూడు కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని ఇంజనీరింగ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. వర్షం నీరు - మంచి నీరు - విద్యుత్‌ కోసం వేర్వేరుగా పైప్‌ లైన్లు - కేబుల్‌ వేసినప్పటికీ కిలో మీటర్‌ కు 5 కోట్ల రూపాయలకు మించి వ్యయం కాదని చెబుతున్నారు. అలాంటిది సగటున కిలోమీటర్‌ కు 17.23 కోట్ల రూపాయల మేర అంచనాలను రూపొందించడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News