ఎర్ర‌చంద‌నం కోసం సూప‌ర్ స్కెచ్‌

Update: 2015-11-14 06:55 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న అంశాల్లో ఎర్రచందనం ఒక‌టి. రాష్ర్టానికి ఆదాయ వ‌న‌రులను అందించ‌డంలో ఎర్ర‌చంద‌నంది ప్ర‌ముఖ పాత్ర‌. అయితే ఎర్ర‌చంద‌నం స్మగ్లింగ్ ఏపీ ప్ర‌భుత్వానికి భ‌లే చిక్కులు తెచ్చిపెడుతోంది. ఈ క్ర‌మంలో స్మగ్లింగ్‌ నిరోధించడానికి ప్రభుత్వం సరికొత్త వ్యూహాలను అనుసరించేందుకు సిద్ధ‌మైంది. ఇందుకోసం ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాల‌ని భావిస్తోంది.

ఎర్రచందనం చెట్లకు భద్రత కల్పించే విషయంలో, స్మగ్లింగ్‌ ను నిరోధించడానికి పోలీసు బలగాల సంఖ్యను భారీగా పెంచారు. అయిన‌ప్ప‌టికీ స్మ‌గ్లింగ్ సాగుతుండ‌టంతో  భద్రతా బలగాలను ప్రవేశించడానికి వీల్లేని చోట్ల ఈ- భద్రతను కల్పించే దిశగా ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పోలీసులు - భద్రతా బలగాలు నిఘా ఉంచడానికి వీలు లేని చోట్ల ఇప్ప‌టికే సీసీ కెమెరాలను అమర్చింది. ఇలా శేషాచలం అడవుల్లో కీలకమైన 19 చోట్ల సీసీ కెమెరాల‌ను అమర్చారు. 24 గంటలూ వాటిని పర్యవేక్షించడానికి తిరుపతిలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ను ఏర్పాటు చేశారు. అయితే వీటికితోడుగా డ్రోన్లతో నిఘాను పర్యవేక్షించాల‌ని ఏపీ ప్ర‌భుత్వం డిసైడ‌యింది.

డ్రోన్ల సహాయంతో గగనతలం నుంచి ఎర్రచందనంపై నిరంత‌రం నిఘా ఉంచడం తేలిక కానున్న నేప‌థ్యంలో డ్రోన్ల వినియోగంపై అటవీశాఖ కసరత్తు చేస్తోంది. డ్రోన్ల సహాయంతో స్మగ్లర్ల కదలికలను కనిపెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవలే అటవీశాఖ అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు డ్రోన్లను సమకూర్చుకునే పనిలో పడ్డారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. మరో రెండు నెలల్లో ఇది కార్యరూపం దాల్చవచ్చున‌ని స‌మాచారం.
Tags:    

Similar News