ఆంధ్రజ్యోతి వర్సెస్ సుబ్రమణ్య స్వామి కేసు తాజా అప్డేట్

Update: 2022-08-13 04:32 GMT
తిరుమల తిరుపతి దేవస్థానం పరువుకు భంగం వాటిల్లేలా రెండు కథనాల్ని ఆంధ్రజ్యోతి ప్రచురించిందని.. ఆ పత్రిక మీదా.. పత్రిక యజమాని ఆర్కే మీదా రూ.100 కోట్ల పరువునష్టం దావా వేశారు బీజేపీ రాజ్యసభ సభ్యులు సుబ్రమణ్య స్వామి.

పలు అంశాల మీద న్యాయస్థానాల్లో కేసులు వేయటం ద్వారా ఫేమస్ కావటంతో పాటు.. తాను ఒకసారి టార్గెట్ చేస్తే.. టార్గెట్ చేసిన వారి పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుందని సుబ్రమణ్య స్వామికి పేరున్న సంగతి తెలిసిందే. ఇలాంటివేళ.. ఆయన ఆంధ్రజ్యోతి మీద వేసిన కేసు అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ కేసుకు సంబంధించిన కీలక అప్డేట్ చోటు చేసుకుంది. అదేమంటే.. టీటీడీ తరఫున సుబ్రమణ్య స్వామి.. మరో ఇద్దరు లాయర్లు వాదనలు వినిపించటానికి టీటీడీ కోర్టు అనుమతి కోరింది. అందుకు ఓకే చేస్తూ గత మే ఒకటిన ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్ ఇతర ప్రతివాదులు పిటిషన్ వేశారు.

టీటీడీకి లాయర్ ను నియమించుకునే శక్తి ఉందని పేర్కొన్నారు. స్వామి అడ్వొకేట్ యాక్ట్ సెక్షన్ 32 నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని.. వ్యక్తిగత ఆసక్తితో వాదిస్తున్నట్లుగా పేర్కొన్నారు.

కేసు వాదించేందుకు కోర్టు ఇచ్చిన అనుమతిని దుర్వినియోగం చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. దీనిపై స్వామి స్పందించారు. తనకు చట్టాల మీద అవగాహన ఉందని. ఫ్రీగా కేసు వాదిస్తున్న విషయాన్ని తెలుపుతూ వాదనలు వినిపించారు.

ఆంధ్రజ్యోతి కథనాలు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని.. అందుకే వాదిస్తున్నట్లుగా పేర్కొన్నారు. లాయర్ కాని వారు కూడా కోర్టులో వాదించటానికి అర్హత ఉందన్న విషయాన్ని తెలిపారు. ఈ నేపథ్యంలో స్వామి వాదనలతో ఏకీభవించిన కోర్టు.. ఆంధ్రజ్యోతి పిటిషన్ ను కొట్టేసింది. ఈ కేసులో ఇదో కీలక పరిణామంగా అభివర్ణిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ కేసు విచారణ ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి.
Tags:    

Similar News