ఆ పదవి ఎవరికి అచ్చి రావటం లేదా?

Update: 2016-03-08 22:30 GMT
వినటానికి కొన్ని అంశాలు విచిత్రంగా అనిపించినా.. లాజిక్ గా లెక్కలు చెబితే అవును కదా అని నోరు వెళ్లబెట్టాల్సి వస్తుంది. తాజాగా అలాంటి విషయమే ఒకటి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ‘‘పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్’’ పదవి అంటేనే నేతలు హడలి పోతున్నట్లుగా చెబుతున్నారు. ఈ పదవి చేపట్టిన వారికి ఎదరుదెబ్బలు తగలమో.. లేదంటే ఊహించని పరిణామాలు చోటు చేసుకోవటమో జరుగుతుందని చెబుతున్నారు.

ఇది ఏ ఒక్క రాష్ట్రంలోనో కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉండటం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం వరకూ చూస్తే.. విభజన తర్వాత ఈ పదవిని చేపట్టిన తొలి నేత నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి. అనూహ్యంగా ఆయన అనారోగ్యంతో ఆకాల మరణం చెందారు. ఇదిలా ఉంటే.. ఆయన తర్వాత ఈ పదవిని కాంగ్రెస్ సీనియర్ నేత.. మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డికి కట్టబెట్టారు. ఇటీవలే ఆయన కూడా అనారోగ్యంతో కన్నుమూశారు.

తెలంగాణలో పరిస్థితి ఇలా ఉంటే.. ఏపీలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొని ఉంది. ఈ పదవికి మొన్నటి వరకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన భూమా నాగిరెడ్డి ఎన్నికయ్యారు. ఆయన కాస్తా.. ఏపీ అధికారపక్షంలోకి జంప్ కావటం తెలిసిందే. ఆయన తర్వాత ఈ పదవిని ఇప్పటివరకూ ఎవరికి అప్పజెప్పలేదు.

ఇదిలా ఉంటే.. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఈ పదవిని చేపట్టిన వారికి కలిసి రాలేదని చెబుతారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పదవిని చేపట్టిన నాగం జనార్దనరెడ్డి తర్వాత కాలంలోపార్టీని వీడటం తెలిసిందే. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కేఈ కృష్ణమూర్తి ఈ పదవిని చేపట్టారు . తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో ఏపీ నుంచి ఈ పదవిని ఆశిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు శ్రీకాంత్ రెడ్డి.. జ్యోతుల నెహ్రు.. తాజా సెంటిమెంట్ గురించి తెలిసి సైలెంట్ అయిపోయినట్లు చెబుతున్నారు.

అదే సమయంలో తెలంగాణలో ఈ పదవిని ఆశిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు డీకే అరుణ.. గీతారెడ్డిలు.. ఈ పదవి తమకే కావాలన్న పట్టుదలతో వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న తాజా సెంటిమెంట్ గురించి వీరి చెవిన వేసే ప్రయత్నం చేసిన వారిని.. అలాంటి నమ్మకాలు వద్దన్నట్లుగా చెప్పినట్లు చెబుతున్నారు. పదవి కోసం కొన్ని నమ్మకాల్ని పట్టించుకోకపోతే ఎలా అన్న మాట కొందరి నోట వినిపిస్తోంది.
Tags:    

Similar News