బాబును తిట్టే స్వామికి ద‌గ్గ‌ర‌వుతున్న మంత్రులు

Update: 2016-02-19 09:12 GMT
విశాఖ శారదాపీఠాధిప‌తి స్వరూపానందేంద్ర సరస్వతికి, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడుకు మ‌ధ్య ఉన్న "ఆత్మీయ శ‌త్రుత్వం" గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. చంద్ర‌బాబు బాగుకోసం, ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధి కోసం అని చెప్తూనే స్వ‌రూపానందేంద్ర ప్ర‌తి సంద‌ర్భంలోనూ ఆయ‌నపై విరుచుకుప‌డుతుంటారు. ఏకంగా శాపాలు పెడుతుంటారు. ప్రత్యేక హోదా మొదలుకొని పరిపాలన - పండగలు - పుష్కరాలు - బాక్సైట్ అన్నింటిపై తనదైన శైలిలో దుయ్య‌బట్టారు. అయితే చంద్ర‌బాబు అంటే ఒంటికాలిపై లేచే స్వ‌రూపానందేంద్ర‌కు ఇపుడు ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌ తో పాటు ఏపీ మంత్రులు, అందులో చంద్రబాబు స‌న్నిహితులు ద‌గ్గ‌ర‌వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

శార‌ద‌పీఠం వార్సికోత్సవాల్లో భాగంగా విశాఖ స‌మీపంలోని పెందుర్తిలోజ‌రిగిన కార్య‌క్ర‌మాల్లో మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు - అనకాపల్లి పార్లమెంటు సభ్యులు అవంతి శ్రీనివాస్‌ - రాష్ట్ర రోడ్లు - రవాణాశాఖ మంత్రి శిద్ధా రాఘవరావు దంపతులు దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మ‌రోవైపు ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ సైతం శార‌దాపీఠాన్ని సంద‌ర్శించుకొని స్వ‌రూపానందేంద్ర స్వామి ఆశీస్స‌లు పొందారు. ఇలా ఇటు ప్ర‌తిప‌క్ష నేత‌తో పాటు అధికారం పంచుకుంటున్న మంత్రులు, ఎంపీలు సైతం బాబును తప్పుప‌ట్టే స్వ‌రూపానందేంద్రుడి ఆశీస్సులు తీసుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

గతంలో స్వ‌రూపానందేంద్ర చంద్ర‌బాబుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బీజేపీకి బానిసత్వం చేస్తున్నారని, ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలో బీజేపీ, రాష్ర్టంలో టీడీపీ కలిసి నాటకం ఆడుతున్నాయని ఆరోపించారు. భారతీయ సంస్కృతికి పునాదులు వేసి హిందూ మతోద్ధరణ కోసం పాటుపడుతున్న పీఠాలకు, పీఠాధిపతులకు మనుగడ లేకుండా కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని స్వరూపానందేంద్ర ఆరోపించారు. దిక్కుమాలిన ప్రభుత్వం ఇది ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. గిరిజన ప్రాంతాలు భగవంతునితో సంబంధం ఉన్న ప్రదేశాలని పేర్కొంటూ బాక్సైట్‌ తవ్వకాల‌కు గ్రీన్‌ సిగ్న‌ల్ ఇవ్వ‌డం ప్ర‌భుత్వ దుర్మార్గ చ‌ర్య అని విమర్శించారు.
Tags:    

Similar News