సాక్షి దెబ్బ‌కి ఏపీ మంత్రుల‌కు ఎక్క‌డో కాలింది!

Update: 2016-03-02 12:12 GMT
ఈ మ‌ధ్య కాలంలో ఏపీలో చాలానే రాజ‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మీద తీవ్ర ఆరోప‌ణ‌లు.. విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. అయితే.. ఏ సంద‌ర్భంలోనూ చెల‌రేగిపోని ఏపీ మంత్రులు బుధ‌వారం మాత్రం ఓ రేంజ్‌ లో విరుచుకుపడ్డారు. ఇది ఓ అంత‌ర్జాతీయ స్కామ్ అంటూ.. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో భారీ దురాక్ర‌మ‌ణ జ‌రిగిందంటూ జ‌గ‌న్ ప‌త్రిక సాక్షిలో భారీ క‌థనాన్ని ఈ రోజు ప్ర‌చురించ‌టం తెలిసిందే. మొత్తం మూడు పేజీల్లో అచ్చేసిన ఈ క‌థ‌నం.. ఇది శాంపిల్ మాత్ర‌మే.. ప‌క్కా ఆధారాలు మా చేతిలో ఉన్నాయి. వాటిని  వ‌రుస‌గా ప్ర‌చురిస్తామంటూ పేర్కొంది. ఈ కథ‌నం తాలూకు ప్ర‌భావం ఏపీ మంత్రుల మీద ప‌డింది.

త‌మ‌పై చేసిన ఆరోప‌ణ‌ల‌పై ఏపీ మంత్రులు ప‌లువురు స్పందించారు. ఈ రాజ‌ధాని దురాక్ర‌మ‌ణ‌లో భారీగా భూమిని సేక‌రించిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మంత్రి నారాయ‌ణ మాట్లాడుతూ.. తాను డ‌బ్బు కోసం రాజ‌కీయాల్లోకి రాలేద‌ని.. త‌న‌కు భూమి ఉంద‌ని చెబుతున్న ఆరోప‌ణ‌లు నిరూపిస్తే.. దాన్ని ప్ర‌జ‌ల‌కు పంచేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని వెల్ల‌డించారు. రాజ‌ధాని ప్రాంతంలో ఏ లావాదేవీ జ‌రిగినా దాన్ని త‌మ‌కు అంట‌కట్ట‌టం స‌రికాద‌న్న నారాయ‌ణ‌.. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత‌కు సొంత ప‌త్రిక ఉంది కాబ‌ట్టి ఇష్టారాజ్యంగా రాయించ‌టం స‌రికాద‌న్నారు. త‌న‌కు ఇప్ప‌టికే వ్యాపారాలు ఉన్నాయ‌ని.. డ‌బ్బు కోసం తాను రాజకీయాల్లోకి రాలేద‌ని.. ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు మాత్ర‌మే తాను పాలిటిక్స్ లోకి వ‌చ్చిన‌ట్లుగా పేర్కొన్నారు. జ‌గ‌న్ సైకో కావ‌టంతో ఎమ్మెల్యేలు పార్టీ విడిచి పెట్టి వెళుతున్నార‌ని.. ఇలాంటి రాత‌లు రాయిస్తున్నారన్నారు. ఆయన వైఖరితో మరింత‌మంది పార్టీ నేత‌లు వెళ్లిపోవ‌టం ఖాయ‌మ‌ని హెచ్చ‌రించారు.

మ‌రో మంత్రి ప‌త్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ.. త‌ప్పుడు ప‌నులు చేసి ఇప్ప‌టికే కేసుల చిక్కులు ఎదుర్కొంటున్న జ‌గ‌న్‌.. త‌ప్పుడు రాత‌లు రాసి మ‌రిన్ని కేసులు మీద‌కు తెచ్చుకోవ‌ద్ద‌న్నారు. త‌ప్పుడు క‌థ‌నాలు రాసినందుకు కేసులు పెడ‌తామ‌ని చెప్పిన ప‌త్తిపాటి.. దేశంలోనే అతి పెద్ద భూబ‌కాసురుడు జ‌గ‌న్ అని మండిప‌డ్డారు. రాజ‌ధాని ప్రాంతంలో ఎవ‌రికైతే భూములు ఉన్నాయ‌ని ప‌త్రిక‌లో రాయించారో అందులో ఒక్క‌రికి ఉన్నా.. ఆ భూముల‌న్నీ ప్ర‌జ‌ల‌కు పంచిపెడ‌తామ‌ని పేర్కొన్నారు. త‌ప్పుడు క‌థ‌నాలు రాసినందుకు సివిల్‌.. క్రిమిన‌ల్ కేసులు పెడ‌తామ‌ని.. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కూడా ఫిర్యాదు చేస్తామ‌న్నారు.

మ‌రో మంత్రి రావెల కిశోర్‌ బాబు మాట్లాడుతూ.. త‌న‌పై చేసిన ఆరోప‌ణ‌ల్ని జ‌గ‌న్ కానీ నిరూపిస్తే తాను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని..  ఒక‌వేళ త‌న మీద ఆరోప‌ణ‌ల్ని కానీ నిరూపించ‌లేక‌పోతే.. సాక్షి ప‌త్రిక‌ను మూసేస్తారా? అని సూటిగా ప్ర‌శ్నించారు. ద‌ళితుల భూములు కొన్న‌ట్లు నిరూపిస్తే.. ఆ భూముల్ని ద‌ళితుల‌కు పంచిపెడ‌తాన‌ని వ్యాఖ్యానించారు. ఇలా.. ఎవ‌రికి వారు.. ఓ రేంజ్‌లో జ‌గ‌న్ పై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్త‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News