విల్లాలకే గురి పెట్టిన ఏపీ ఎమ్మెల్యేలు

Update: 2016-08-15 05:47 GMT
మనమేం చేద్దామనే దాని కంటే మనకేం చేయాలన్న ఆలోచన సామాన్యుడిలో ఉండటాన్నే తప్పు పడతాం. అలాంటి రాజకీయ నేతల్లో ఉంటే.. అంతకు మించిన దౌర్భాగ్యం మరొకటి ఉండదు. తాజాగా.. ఏపీ ఎమ్మెల్యేల ఆలోచన గురించి వింటే ఇదే భావన కలగక మానదు. ఏపీ రాజధాని అమరావతిలో ఏపీ ఎమ్మెల్యేలకు చూడచక్కటి విల్లాలు నిర్మించాలన్న డిమాండ్ రోజురోజుకీ పెరగుతోందట. అమరావతి సీడ్ కేపిటల్ ఏరియాలో ఎమ్మెల్యేలకు అత్యాదునిక విల్లాలు ఏర్పాటు చేసి.. వాటిని తమకు కేటాయిస్తే.. తామంతా ప్రజాసేవలో పునరంకితం అవుతానన్నట్లుగా మాటలు చెప్పటం వారికే చెల్లుతుందేమో.

ఓపక్క పీకల్లోతు ఆర్థిక కష్టాలతో ఏపీ రాష్ట్రం కిందామీదా పడిన వేళ.. ఖర్చు విషయంలో కట్టడి పాటించాలని అంతా సలహాలు ఇస్తున్నవేళ.. వీలైనంత వరకూ ప్రభుత్వం మీద భారం పడకుండా చూడాల్సిన బాధ్యత  ప్రజాప్రతినిధులుగా రాజకీయ నేతల మీద ఉంటుంది. దీనికి భిన్నంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి.. భారం లాంటి వాటిని పట్టించుకోకుండా తమ సుఖం.. సౌకర్యమే ముఖ్యమన్నట్లుగా వ్యవహరిస్తున్న ఏపీ ఎమ్మెల్యేల తీరు చూస్తే అవాక్కు అవ్వాల్సిందే.

రాజధాని సీడ్ కేపిటల్ లో చక్కటి విల్లాల సముదాయాన్ని నిర్మించి.. వాటిని ఎమ్మెల్యేలకు ఇవ్వాలన్న ప్రతిపాదన చేస్తున్న ఎమ్మెల్యేలు ఎంచక్కా దీనికో బ్రహ్మండమైన లాజిక్ కూడా చెప్పుకురావటం విశేషం. ప్రతి నగరానికి ఒక ఆకర్షణీయమైన ప్రాంతం ఉంటుందని.. అలానే అమరావతిలోనూ అలాంటి ప్రాంతం ఒకటి ఉండాలని.. ఆ ఒక్కటిలో ఎమ్మెల్యేల విల్లాలు అయితే మరింత బాగుంటుందని.. ఆ పని కానీ చేస్తే ఆ ప్రాంతమంతా ఒక ఆకర్షణీయమైన ప్రదేశంగా మారుతుందని ప్రభుత్వ పెద్దలకు ఎమ్మెల్యేలు చెబుతున్నారు.

ఈ నివాస సముదాయానికి 150ఎకరాల్లో నిర్మించాలని..విల్లాల నిర్మాణం పూర్తి అయిన పక్షంలో రాజధాని అమరావతికి సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అవుతుందని.. టూరిస్టులతోపాటు.. పెట్టబడి దారుల్ని కూడా విశేషంగా ఆకర్షించే వీలుందని చెబుతున్నారు. మరి.. ఎమ్మెల్యేల ప్రతిపాదన విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News