మీ ద‌యా.. ధ‌ర్మం మాకొద్దు

Update: 2015-08-11 14:43 GMT
రాష్ట్రం విడిపోయాక పుట్టెడు దుఃఖంలో ఉన్నా మ‌నో నిబ్బ‌రంతో ఏపీ మున్ముందుకు సాగుతోంది. ప్ర‌త్యేక హోదా ఐదేళ్లు కాదు ప‌దేళ్లు ఇస్తామ‌న్న బీజేపీ ఇప్పుడు ముఖం చాటేస్తుండ‌డంతో ఏం  చేయాలో దిక్కుతోచ‌ని స్థితిలో చంద్ర‌బాబు స‌ర్కార్ ఉంది. లోటు బ‌డ్జెట్ తో కాలం నెట్టుకువ‌స్తూ.. అభివృద్ధి పనులు చేప‌ట్ట‌లేక‌, ఇదివ‌ర‌కు ప్రారంభించిన ప‌నులు ముగించ‌నూ లేక సాయం ప్ర‌భో అని కేంద్రాన్ని అర్థిస్తోంది. అయినా మోడీ ప్ర‌భుత్వం ఏ మాత్రం క‌రుణ చూప‌కుండా ముందుకు వెళుతోంది.

ఆదుకునే మాటెలా ఉన్నా.. కేంద్రం తీరే ఈటెలా గుచ్చుకుంటోంది.ఇవాళ ప్ర‌త్యేక  హోదా సాధ‌న అన్న‌ది హ‌క్కుగా ప‌రిణ‌మించిన వేళ .. విద్యార్థులు రోడెక్కుతున్న త‌రుణాన కేంద్రం ఇదిగో..అదిగో అంటూ కాల‌హ‌ర‌ణం చేస్తోంది. కానీ.. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాత్రం ఇప్ప‌టికీ ఏపీకి సాయం అందించేందుకు తాము సానుకూలంగా ఉన్నామ‌ని ఇవాళ ఎంపీల‌తో చెప్పారు. బాగుంది ఇంత‌కీ ఏ తీరున ఆదుకుంటావో చెప్పావా.. ద‌యార్థ్ర హృద‌యా! ఏ రీతిన మ‌మ్మ‌ల్ని అక్కున చేర్చుకుంటావో వివ‌రంగా వివ‌రించావా ఓ క‌రుణా స‌ముద్రా..!  విభ‌జ‌న‌లో భాగంగా హైద్రాబాద్ ను  కోల్పోయి ఏపీ నానా అవ‌స్థ‌ల్లో ఉంద‌ని మీరే అంటూ.. క‌న్నీరు కారుస్తూ.. ఓదార్పు అందిస్తూ.. మాయ‌మాట‌లేల చెబుతారు. ఇప్ప‌టికే ప‌న్ను రాయితీ అందించామ‌ని అంటున్నారు.

మీరు విదిల్చిన నిధులెన్నో చెప్ప‌గ‌ల‌రా.. అవి మా రాజ‌ధాని నిర్మాణానికి.. మా రాష్ట్ర ప్ర‌గ‌తి.. పారిశ్రామిక పురోగ‌తికి ఏ విధంగా దోహ‌ద‌ప‌డ‌గ‌ల‌వో వివ‌రించ‌గ‌ల‌రా..! ఏమంటే త్వ‌ర‌లోనే మ‌రిన్ని నిధులు ఇస్తాం.. రాయితీలు ప్ర‌క‌టిస్తాం అంటారు. రాజ‌ధాని నిర్మాణానికి అవ‌స‌ర‌మైన ఆర్థిక సాయం చేస్తాం అంటారు. ఇదంతా పైపై మాట‌లే కానీ లోలోప‌ల మాత్రం మీ అంత‌రార్థం ఏపీనే కాదు విడిపోయి ఏడుస్తున్న ఏ రాష్ట్రాన్నీ మీరు ఆదుకోరు. కానీ చిన్న రాష్ట్రాల అభివృద్ధే ధ్యేయం అంటారు. భార‌త‌దేశ సౌభ్రాత‌త్వం కోసం క‌ల‌లు కంటారు.  ప్రాంతాల‌ను విభ‌జిస్తూ.. పాలిస్తూ.. అదే అభివృద్ధి అనుకుంటే ఎలా అని నేడు ప్ర‌తి ఒక్క ఆంధ్రుడు గొంతెత్తి బీజేపీని ప్ర‌శ్నిస్తున్నాడు.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ ప్ర‌భుత్వం అడ్డ‌గోలుగా రాష్ర్టాన్ని ముక్కులు చేస్తున్న‌ప్పుడు మీరు మ‌ద్ద‌తు ఇచ్చారు స‌రే. అప్పుడైనా ఏపీకి అన్యాయం త‌గ‌దు..వారి కోసం మరిన్ని నిధులు ఇవ్వాల‌నో, లేదా ప్ర‌త్యేక హోదా విభ‌జ‌న చ‌ట్టంలో చేర్చాల‌నో ప‌ల్లెత్తుమాట అయినా మాట్లాడారా..ఈ రోజు ఏపీపై మీకెందుకంత క‌క్ష‌. మీరు చేస్తున్న‌దంతా ఏపీ ప్ర‌జ‌లు ఓ కంట క‌నిపెడుతూనే ఉన్నారు. ఎంతో చ‌రిత్ర ఉన్న కాంగ్రెస్‌కు ఏ స్థాయిలో గుణ‌పాఠం చెప్పారో చూశారు క‌దా..అస‌లే అంతంత మాత్రం అన్న‌ట్టుగా ఏపీలో కునారిల్లుతున్న బీజేపీకి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాంటి స‌త్కారం చేస్తారో మీరే చూస్తారు.

ఏదేమైనా.. హ‌క్కుల సాధ‌న‌లో మేము.. బాధ్య‌త‌లు మ‌రిచి మీరు! పోరాట పంథాలో మేము.. ప్రేక్ష‌క పాత్ర‌లో మీరు అన్న‌ట్టుగా ఏపీకి కేంద్రానికి జ‌రుగుతున్న ఈ పోరులో  ఆంధ్రోడు త‌ల‌చుకుంటే ఢిల్లీ పీఠాలు ఎలా క‌దిలాయో చ‌రిత్ర ఒక్క‌సారి తిర‌గేసి చూసుకుంటే మీకే తెలుస్తోంది ఆంధ్రోడి ప‌వ‌ర్‌.
Tags:    

Similar News