ఏపీ ప్రజల ఎంపిక జగన్, కేసీఆర్ లే?

Update: 2017-03-05 07:57 GMT
ఒక నిర్ణయం తీసుకుంటే.. మంచో చెడో.. కష్టమో - నష్టమో.. దానికే కట్టుబడి ఉండటం, నిజంగా ఇది చాలా గొప్ప లక్షణం. అలా ఉండాలంటే ఎన్నో గట్స్ ఉండాలి, మానసిక స్థైర్యం ఉండాలి. ఇలాంటి వారు కచ్చితంగా సక్సెస్ ఫుల్  అనిపించుకుంటారు. తాము ఎంచుకున్న రంగంలో రాణించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి ధృఢ చిత్తంతో ఉండే మనుషులు ప్రతి రంగంలోనూ ఉంటారు. విద్యా - వ్యాపారం - సినీ రంగం.. ఎక్కడ చూసినా ఇలాంటి ప్రత్యేకతను  కలిగిన వారు కనిపిస్తారు.

మరి రాజకీయ రంగం కూడా దీనికి మినహాయింపు కాదు. కుళ్లూకుతంత్రాలే ఉంటాయన్న ఈ రంగంలోనూ అప్పుడప్పుడు ధృఢ చిత్తం కలిగిన వారిని చూస్తూ ఉంటారు. వ్యతిరేకుల చేత ఎన్ని విమర్శలనైనా ఎదుర్కొని ఉండవచ్చు గాక.. వైఎస్ రాజశేఖర రెడ్డిలో ఇదే నేచర్ కనిపించింది. తను అనుకున్నది చేశాడాయన.. వరసగా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు… కేవలం ఐదున్నర సంవత్సరం సీఎంగా చేసి, అంత పెద్ద రాష్ట్రంపై అంత ప్రభావం చూపిన వ్యక్తిగా వైఎస్ శాశ్వత ముద్ర వేశాడంటే… దానికి వైఎస్ నేచరే కారణం. సంక్షేమ పథకాల అమలు చేస్తానని హామీలు ఇవ్వడమే కాదు.. హామీలు ఇవ్వని పథకాలను అమలు చేశాడు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా వెనుకాడలేదు. వైఎస్ ప్రవేశ పెట్టి సంక్షేమ పథకాలను తొలగించే ధైర్యం నేటి ముఖ్యమంత్రులకు కూడా లేదంటే.. వైఎస్ లానే మేమూ అనే చెప్పుకుంటున్నారంటే, దటీజ్ వైఎస్ ఆర్ అని చెప్పకతప్పదు.

ప్రస్తుత ముఖ్యమంత్రుల్లో కేసీఆర్ నేచర్ కూడా దాదాపుగా వైఎస్ ను తలపింపజేస్తోంది. తను అనుకున్నది చేయడం లో కేసీఆర్ ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. సంక్షేమ పథకాల అమలులో అయితేనేం… రాజకీయంగా అయితేనేం.. కేసీఆర్ సమ్మోహనాస్త్రాలనే ప్రయోగిస్తున్నాడు. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు అలసిపోయాయి, ఊసులో లేకుండా పోయాయి. ఆఖరికి కోదండరాం వంటి వ్యక్తి రణరంగంలోకి దిగినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందంటే… పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇక ప్రస్తుత ఏపీ విషయానికి వస్తే… బాబు వద్ద మాత్రం ఇలాంటి సమ్మోహనం లేదని అర్థం అయిపోయింది. నూటికి తొంభై శాతం మీడియా వర్గాలు అనునిత్యం ఆయనను ఆకాశానికి ఎత్తుతున్నా… అద్భుతాలు జరిగిపోతున్నాయని చెబుతున్నా.. బాబు విషయంలో ప్రధానంగా విశ్వసనీయత లోపిస్తోంది. ఏదో జరుగుతోందంటే.. నమ్మే వాళ్లు తక్కువ శాతంగానే కనిపిస్తున్నారు. అనుకూల మీడియాలో రాసుకోవడమే తప్ప.. వాస్తవాలు కాదనే క్లారిటీ అందరికీ వచ్చేసిందిప్పటికే.

తాజాగా హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర సమితి వారు చేపట్టిన సర్వేను ఈ సందర్భంలో ప్రస్తావించుకోవాలి. హైదరాబాద్ లోని తెలంగాణ వారు - సీమాంధ్రులు అనే తేడా లేకుండా… ప్రైవేట్ సంస్థతో చేపట్టిన ఈ అధ్యయనంలో కేసీఆర్ కు దాదాపు నలభై రెండు శాతం మంది మద్దతు దక్కిందట. ఏపీకి కూడా ఈ తరహా పాలకుడు కావాలనే కోరిక వ్యక్తం అయ్యింది సెటిలర్ల నుంచి. మరి అలాంటి వారు ఎవరు? అంటే.. జగన్ పేరే వినిపించడం విశేషం.

బూటకపు హామీలు - అద్భుతాలు చేస్తామనే ఊరడింపులు - ప్రచార ఆర్భాటాలతో ప్రజలు విసిగిపోయారు. మూడేళ్ల కిందట ఎలాంటి కబుర్లు చెప్పారో.. ఇప్పుడూ అవే  కబుర్లు.. ఎన్నికల హామీల అమలు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలు విసిగి వేసారిపోయినట్టుగానే కనిపిస్తున్నారు. మరి ఈ విసుగులో జగన్ చెబుతున్న మాట వీరిని ఆకర్షిస్తోంది.

అబద్ధాల హామీలు ఇవ్వను… అలా ఇచ్చుంటే అధికారాన్ని ఎప్పుడో సంపాదించుకునే వాడిని… అని జగన్ అంటున్నాడు. ఇచ్చిన హామీల విషయంలో వెనక్కు తగ్గను అని కూడా జగన్ అంటున్నాడు. మరి ఇప్పటి వరకూ జగన్ తీరును  చూసినా.. “మొండివాడు..’’ అనే అభిప్రాయం కలుగుతుంది. కాంగ్రెస్ హై కమాండ్ తో విబేధించి బయటకు రావడం.. చాలా కష్టనష్టాలను కూడా ఓర్చి నిలవడంతో జగన్ గట్స్ ఏమిటో , అతడి ప్లస్ పాయింట్లు ఏమిటో అర్థం అవుతోంది జనాలకు. పూటకో మాట చెప్పి.. కట్టు కథలు చెప్పి.. ఊహల్లో మాత్రమే విహరింపజేసే వ్యక్తి కన్నా… వాస్తవానికి దగ్గరగా ఉండే వ్యక్తి కావాలనే జనాలు కోరుకుంటున్నారు. తెలంగాణలో ఈ విషయంలో కేసీఆర్ కు ఫుల్ మార్క్స్ పడుతున్నాయి. హైదరాబాద్ లోని సీమాంధ్రులు కూడా కేసీఆర్ లాంటి సీఎం కావాలని అంటున్నారు, మరి అదెవరంటే జగన్ పేరే వినిపిస్తోందని తెరాస ప్రైవేట్ సర్వే చెబుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News