తెలుగు రాష్ట్రాల మ‌ద్య కొత్త లొల్లి.. ఆర్‌సీ భ‌వ‌న్‌

Update: 2017-05-09 05:34 GMT
రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న విభ‌జ‌న వివాదాలు ఒక్కొక్క‌టిగా ప‌రిష్కారం అవుతున్న వేళ‌.. అనూహ్యంగా సోమ‌వారం దేశ రాజ‌ధాని ఢిల్లీలోని ఆర్ సీ భ‌వ‌న్ ఇష్యూ ఒకటి తెర మీద‌కు రావ‌ట‌మే కాదు.. ప‌లు నాట‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ఈ ఉదంతం ఇరు రాష్ట్రాల మ‌ధ్య కొత్త ఉద్రిక్త‌త‌ల‌కు తెర తీసింది. విభ‌జ‌న జ‌రిగి మూడేళ్లు అవుతున్నా.. నేటికి రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య ఆస్తుల పంచాయితీ మాత్రం ఒక కొలిక్కి రాలేదు. చ‌ర్చ‌ల న‌డుమ వివాదాల్నిప‌రిష్క‌రించుకోవాల్సి ఉన్న‌ప్ప‌టికీ.. అధికారుల మ‌ధ్య చోటు చేసుకున్న స‌మ‌న్వ‌య లోపం.. ఇరు రాష్ట్రాల మ‌ధ్య కొత్త ఉద్రిక్త‌త‌ల‌కు తెర తీసింది.

ఆర్‌సీ భ‌వ‌న్ త‌మ‌దంటే త‌మ‌ద‌ని వాదులాట‌కు దిగిన తెలుగు రాష్ట్రాల అధికారుల కార‌ణంగా సోమ‌వారం అనూహ్య ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. ఈ భ‌వ‌న్ త‌మ‌దేనంటూ తెలంగాణ అధికారులు తాళం వేసేయ‌గా.. ఆంధ్రా అధికారులు తాళం ప‌గ‌ల‌గొట్టి.. త‌మ‌దే ఆ భ‌వ‌న్ అని ప్ర‌క‌టించుకున్నారు. చివ‌ర‌కూ ఉద్రిక్త‌త‌ల మ‌ధ్య ఇరువ‌ర్గాల వారు తాళాలు వేసుకున్నారు.

ఈ వివాదం మీద ఇరు రాష్ట్రాల వాద‌న‌లు చూస్తే..

తెలంగాణ రాష్ట్ర అధికారుల వాద‌న‌..

విభ‌జ‌న చ‌ట్టం ప్రకారం ఆస్తుల్ని 58:42 నిష్ప‌త్తిలో విభ‌జించుకోవాల్సి ఉంది. కేంద్ర హోం శాఖ సూచ‌న‌కు త‌గ్గ‌ట్లే గ‌తంలో తెలంగాణ అధీనంలో ఉన్న ఆర్ సీ భ‌వ‌న్ ప్ర‌స్తుతం ఏపీ కార్య‌క‌లాపాల‌కువినియోగిస్తున్నారు. గ‌తంలో ఏపీ భ‌వ‌న్ అధికారిగా ఉన్న వీనా ఈష్‌.. త‌న ల‌గేజ్ కోసం బంగ్లాను వాడుకుంటాన‌ని చెప్ప‌టంతో అధికారులు ఆయన‌కు తాళాలు ఇచ్చారు. అయితే.. ఆ అధికారిబ‌దిలీ త‌ర్వాత కూడా బంగ్లాను ఏపీ వాడేస్తోంది.  గ‌వ‌ర్న‌ర్‌.. హైకోర్టు సీజే.. ఉప ముఖ్య‌మంత్రులు.. ప్ర‌భుత్వ అధికారులు ఢిల్లీకి వ‌చ్చిన సంద‌ర్బంగా శ‌బ‌రి బ్లాక్ ను కేటాయిస్తున్నారు. అయితే.. భ‌ద్ర‌తా ప‌ర‌మైన స‌మ‌స్య‌ల నేప‌థ్యంలో ఆర్ సీ భ‌వ‌న్ ను కేటాయించాల‌ని గ‌తంలోనే ఏపీ రెసిడెంట్ క‌మిష‌న‌ర్ కు లేఖ రాశాం. అయితే.. ఎలాంటి స్పంద‌న లేదు.

దీంతో.. తెలంగాణ‌కు రావాల్సిన 42 శాతం వాటా ప్ర‌కారం ఆర్‌సీ భ‌వ‌న్ ను అధీనంలోకి తీసుకొని తాళాలు వేశాం. అయితే.. ఆర్ సీ భ‌వ‌న్ త‌మ‌కే చెందుతుందంటూ.. ఏపీ అధికారులు తాళాలు ప‌గ‌ల‌గొట్టి త‌మ అధీనంలోకి తెచ్చుకున్నారు.  

ఏపీ అధికారుల వాద‌న‌

ఏపీ భ‌వ‌న్ లోని ఆర్‌సీ బంగ్లాను గ‌డిచిన మూడేళ్లుగా ఏపీనే వినియోగిస్తోంది. తెలంగాణ అధికారులు క‌నీస స‌మాచారం ఇవ్వ‌కుండా తాళాలు వేసేశారు. స‌మ‌స్య ఉంటే ఇరు వ‌ర్గాల అధికారులు కూర్చొని మాట్లాడుకొని ప‌రిష్క‌రించుకోవాలే కానీ ఇలా తాళాలు వేయ‌టం ఏమిటి? అందుకే.. తెలంగాణ అధికారులు వేసిన తాళాల్ని తొల‌గించాం. మూడేళ్లుగా లేనిది ఇప్పుడే ఆర్‌సీ భ‌వ‌న్ మీద తెలంగాణ అధికారులు ఎందుకు దృష్టి సారించిన‌ట్లు..? అని ప్ర‌శ్నిస్తున్నారు.
ఇదిలా ఉండ‌గా.. ఆర్ సీ భ‌వ‌న్ త‌మ‌దంటే త‌మ‌దంటూ  ఇరు వ‌ర్గాల వాద ప్ర‌తివాదాల న‌డుమ‌.. ఇరురాష్ట్రాల వారు భ‌వ‌న్ కు తాళాలు వేసుకొని వెళ్లారు. ఎవ‌రికి వారు భ‌వ‌న్ త‌మ‌దేనంటూ వినిపిస్తోన్న వాద‌న మ‌రెన్ని ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీస్తుందో? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.
Tags:    

Similar News