ఏపీకి వేసవి, శీతాకాల రాజధానులు ఏర్పాటు చేయాలంటున్న బీజేపీ ఎంపీ!

Update: 2022-05-31 15:30 GMT
ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో వేసవి, శీతాకాల రాజధానులు ఉండాలన్నారు. ఆంధ్రప్రదేశ్ లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది కోసం వీటిని ఏర్పాటు చేయాలని కోరారు. ప్రస్తుతం ఉన్న అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అయితే రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది కోసం రాయలసీమ, ఉత్తరాంధ్రల్లో వేసవి, శీతాకాల రాజధానులు ఏర్పాటు చేయాలని టీజీ వెంకటేష్ కోరుతున్నారు.

వైశ్య సామాజికవర్గానికి చెందిన టీజీ వెంకటేష్ గతంలో కర్నూలు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగారు. తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచే రాజ్యసభకు ఎంపికయ్యారు. అయితే 2019లో టీడీపీ ఆంధ్రప్రదేశ్ లో పరాజయం పాలయ్యాక టీజీ వెంకటేష్ తన తోటి టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ లతో కలసి బీజేపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే వీరిని కేసుల నుంచి తప్పించడానికి బీజేపీలో చేరేలా ప్రోత్సహించారని వైఎస్సార్సీపీ ఆరోపించింది.

కాగా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీని ప్రకారం.. శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు, పరిపాలన రాజధానిగా విశాఖపట్నం ఉంటాయని జగన్ ప్రభుత్వం పేర్కొంది.

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇందుకు తగ్గట్టే అమరావతిని పూర్తిగా విస్మరించింది. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) వంటి వాటి రద్దుకు ఉపక్రమించింది. అమరావతిలో చంద్రబాబు హయాంలో కట్టిన బిల్డింగులన్నీ బూజు, చెదలుతో నిండిపోయాయి. రాజధాని అభివృద్ధిని పూర్తిగా విస్మరించింది.

విశాఖపట్నం మాత్రమే రాజధాని అని.. ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించడానికి జగన్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఇందుకు ఉద్యోగులను సంసిద్ధులను కూడా చేసింది. అయితే రాజధాని అమరావతి రైతులు, జనసేన పార్టీ, టీడీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. దీంతో సీఆర్డీఏ రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు, మూడు రాజధానులను ప్రకటిస్తూ అసెంబ్లీ తీర్మానించిన బిల్లును, ప్రభుత్వ జీవోలను హైకోర్టు కొట్టిపారేసింది. అంతేకాకుండా తమకు తెలియకుండా ప్రభుత్వ కార్యాలయాలను విశాఖపట్నానికి మారిస్తే అధికారులను బాధ్యులను చేస్తామని కోర్టు హెచ్చరించింది. దీంతో జగన్ ప్రభుత్వానికి గట్టి దెబ్బ తగిలింది.

కాగా ఇప్పుడు ఎంపీ టీజీ వెంకటేష్ వ్యాఖ్యలతో మరోమారు రాజధానుల అంశం తెరమీదకొచ్చింది. వాస్తవానికి వేసవి, శీతాకాల రాజధానులు గతంలో జమ్మూకాశ్మీర్ కు ఉండేవి. వేసవి కాల రాజధానిగా జమ్మూ ఉంటే, శీతాకాల రాజధానిగా శ్రీనగర్ ఉండేది. ప్రస్తుతం శ్రీనగర్ ఒక్కటే కశ్మీర్ రాజధానిగా ఉంది. ఈ నేపథ్యంలో టీజీ వెంకటేష్ వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిస్పందన వస్తుందో వేచి చూడాల్సిందే!
Tags:    

Similar News