మహిళలకు జగన్ మరో వరం..వాలంటీర్లలో సగం వారికేనట

Update: 2019-06-13 14:34 GMT
నవ్యాంధ్రప్రదేశ్ కు నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలనాలకే సంచలనాలుగా నిలుస్తున్న నిర్ణయాలను తీసుకుంటున్నారు. తన కేబినెట్ కూర్పులో బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేసిన జగన్... రాష్ట్ర హోం మంత్రి పదవిని ఓ మహిళకు... అది కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మేకతోటి సుచరితకు అప్పగించి సంచలనం సృష్టించారు. అంతేకాకుండా పార్టీ టికెట్ల కేటాయింపులోనూ మహిళలకు పెద్ద పీటే వేసిన జగన్... తాజాగా మరో సంచలనాత్మక నిర్ణయాన్ని ప్రకటించారు.

రాష్ట్రంలో పాలనను ప్రజలకు చేరువ చేసేందుక గ్రామ స్థాయిలో వలంటీర్లను నియమిస్తున్నట్లుగా జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో 4.33 లక్షల వలంటీర్ల నియామకానికి రంగం సిద్ధమైంది. ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ కూడా విడుదలైపోయింది. ఇలాంటి తరుణంలో 4.33 లక్షల గ్రామ వలంటీర్ల పోస్టుల్లో సగానికి సగం పోస్టులను మహిళలకే కేటాయిస్తున్నట్లుగా  జగన్ సంచలన ప్రకటన చేశారు. అంటే... గ్రామ వలంటీర్ల పోస్టుల్లో మహిళలకు ఏకంగా 2.165 లక్షల పోస్టులు దక్కనున్నాయన్న మాట. ఇక గ్రామ వలంటీర్ల పోస్టుల విద్యార్హతల విషయానికి వస్తే... గిరిజన ప్రాంతాల్లో టెన్త్, గ్రామాల్లో ఇంటర్మీడియట్, అర్బన్ ప్రాంతాల్లో డిగ్రీ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది.
Tags:    

Similar News