స్వీప‌ర్ల‌కు మూడు నెల‌లుగా జీతాలు ఇవ్వ‌లేదా బాబు?

Update: 2019-02-28 08:35 GMT
మైకు క‌నిపించినా.. మీడియా గొట్టం ద‌ర్శ‌న‌మిచ్చినా చాలు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాట‌ల‌కు అడ్డూ ఆపూ ఉండ‌దు. త‌న పాల‌న‌కు సంబంధించిన గొప్ప‌ల‌తో పాటు.. ప్ర‌జ‌ల‌కు త‌మ ప్ర‌భుత్వం చేస్తున్న మంచి ప‌నుల చిట్టా భారీగా విప్పుతారు. ఇక‌..తాము అమ‌లు చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల చిట్టాను మా సంతోషంగా చెబుతారు. అయితే.. ఆ ప‌థ‌కాల్లో చాలావ‌ర‌కూ వేర్వేరు రాష్ట్రాల నుంచి అరువు తెచ్చుకున్న‌వేకావ‌టం గ‌మ‌నార్హం.

ఈ విష‌యాల్ని ప‌క్క‌న పెడితే.. తాజాగా గుండెలు చెరువ‌య్యే క‌ఠిన నిజం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. రాష్ట్రంలో మిగిలిన ఉద్యోగుల సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ఏపీ స‌చివాల‌యంలో ప‌ని చేసే స్వీప‌ర్లు ఆందోళ‌న బాట ప‌ట్ట‌టం ఒక ఎత్తు అయితే.. ఇందుకు కార‌ణం తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. తన‌కు మించి బాగా ప‌ని చేసే వారే లేర‌ని చెప్పే చంద్ర‌బాబుకు.. స‌ద‌రు స్వీప‌ర్లుచేస్తున్న నినాదాలను వింటే మంచిగా ఉంటుంద‌ని చెబుతున్నారు.

ఎందుకంటే.. స‌ద‌రు స‌చివాల‌యం స్వీప‌ర్ల‌కు గ‌డిచిన మూడు నెల‌లుగా జీతాలు అంద‌ని ప‌రిస్థితి. త‌న పాల‌న గురించి మా గొప్ప‌లు చెప్పే చంద్ర‌బాబు.. త‌న పాల‌నా భ‌వ‌న‌మైన స‌చివాల‌యంలో ప‌ని చేసే స్వీప‌ర్ల‌కు మూడు నెల‌లుగా జీతాలు లేని ప‌రిస్థితి. వారు త‌మ ఆక‌లి బాధ‌ల్ని తీర్చాల‌ని వేడుకుంటున్న వైనం చూస్తే.. ఒళ్లు మండ‌క మాన‌దు.

బ‌డుగుజీవుల క‌ష్టాన్ని దాచుకోవ‌టం.. అదేమంటే.. దానికేదో నిబంధ‌న‌ల లెక్క‌లు చెప్పే బాబు స‌ర్కారు.. ఉత్తుత్తి వ‌రాల కంటే కూడా నెల‌ల త‌ర‌బ‌డి జీతాలు నిలిపివేసే విధానానికి చెక్ పెట్టాల్సిన అవ‌స‌రం ఉంది. జీతం డ‌బ్బుల మీద బ‌తికే చిన్న ఉద్యోగుల‌కు మూడు నెల‌ల పాటు జీతం రాక‌పోవ‌టానికి మించిన శిక్ష ఏముంటుంది?  చిన్న ఉద్యోగుల జీతాల్ని వ‌దిలేద్దాం కానీ.. బాబుగారు గ‌డిచిన మూడు నెల‌లుగా మీకు మాత్రం జీతం వ‌స్తోందిగా..?

Tags:    

Similar News