ఏపీకి 3 సెల్ ఫోన్ కంపెనీలు వచ్చేస్తున్నాయ్

Update: 2015-09-16 04:45 GMT
దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉంచుతూ ప్రపంచ బ్యాంకు నివేదికను ప్రకటించిన తర్వాతి రోజును చంద్రబాబు సర్కారు ఏపీ ప్రజలకు తీపి కబురును అందించింది. ప్రపంచ బ్యాంకు నివేదికలోని అంశాలు నిజమనిపించేలా ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. విజయవాడలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మూడు మొబైల్ కంపెనీలు చిత్తూరు జిల్లా తిరుపతికి సమీపంలోని రేణిగుంటలో తమ ఫ్లాంట్లను నెలకొల్పేందుకు వీలుగా.. ఎంవోయూలు కుదుర్చుకున్నారు.

ఇప్పటికే ఏపీలో ప్రముఖ మొబైల్ కంపెనీ జియోమీ తన ఉత్పత్తిని ఏపీలో స్టార్ట్ చేస్తే.. తాజాగా దేశీయ బ్రాండ్లుగా పేరొందిన మైక్రోమ్యాక్స్.. సెల్ కాన్.. కార్బన్ కంపెనీలు తమ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. తిరుపతి పారిశ్రామిక క్లస్టర్ అయిన రేణిగుంటలో తమ కంపెనీలు ఏర్పాటు చేసేందుకు వీలుగా ఎంవోయూలు కుదర్చుకున్నారు.

ఒకే వేదిక మీద మూడు కంపెనీలకు చెందిన ప్రతినిధులతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంవోయూలు కుదుర్చుకోవటం ఒక విశేషమైతే.. వీరి ముగ్గురు రాకతో.. మొత్తం నాలుగు సెల్ ఫోన్ కంపెనీలు ఏపీకి వచ్చినట్లుగా చెప్పొచ్చు.

తన హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ను సాఫ్ట్ వేర్ హబ్ గా తయారు చేశామని.. ఇప్పుడు ఏపీని హార్డ్ వేర్ హబ్ గా మారుస్తామన్న దీమాను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కుదిరిన ఎంవోయూ కారణంగా ఏపీలో 7వేల ఉద్యోగాల కల్పన జరిగినట్లు అయ్యిందని చంద్రబాబు చెబుతున్నారు. మొత్తానికి ప్రపంచ బ్యాంక్ నివేదిక తర్వాతి రోజునే మూడు మొబైల్ కంపెనీలతో ఎంవోయూ కుదుర్చుకోవటం శుభ పరిణామంగా చెప్పొచ్చు.
Tags:    

Similar News