రేవంత్ రెడ్డిని తీసిపారేస్తున్న ఏపీ టీడీపీ

Update: 2016-05-16 10:28 GMT
తెలంగాణ టీడీపీలో మిగిలిన ఏకైక కీలక నేత రేవంత్ రెడ్డి మాటలను ఏపీ టీడీపీలో ఎవరూ పట్టించుకోవడం లేదట. ఆయన చేసిన సూచనలకు కానీ, ఆయన డిమాండ్లకు కానీ ఏమాత్రం విలువ లేకుండా పోయిందట. పార్టీ వర్గాలు రేవంత్ మాటలను సింపుల్ గా పక్కన పెట్టేస్తున్నాయి. ఒకప్పుడు దూకుడు గల నేతగా, తెలంగాణ టీడీపీకి ఆశాకిరణంగా భావించి రేవంత్ కు మంచి ప్రయారిటీ ఇచ్చేవి. కానీ, కొద్ది రోజుల్లోనే సీను రివర్సయిపోయింది. ఇప్పుడు రేవంత్ ఏం చెప్పినా కంఠశోషే తప్ప ఇంకే ప్రయోజనం ఉండడం లేదట. తాజాగా మహానాడు నేపథ్యంలో ఆయన చేసిన సూచనలను టీడీపీ వర్గాలు సింపుల్ గా కొట్టిపారేసినట్లు తెలుస్తోంది.

ఈ నెల 27 నుంచి తిరుపతిలో టీడీపీ మహానాడు నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా ప్రవేశపెట్టబోయే తీర్మానాల విషయంలో రేవంత్ ప్రతిపాదనలను ఎవరూ పట్టించుకోలేదని తెలిసింది.  ముఖ్యంగా తెలంగాణలో టీఆరెస్ ఫిరాయింపులను ప్రోత్సహిండుడానికి వ్యతిరేకంగా తీర్మానాన్ని పెట్టి తీరాల్సిందేనని పట్టుబడుతుండగా ఏపీ టీడీపీ నేతలు అందుకు ససేమిరా అంటున్నారట. దీనికి కారణం సుస్పష్టం... తొలుత తెలంగాణలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేలను టీఆరెస్ ఎత్తుకుపోయినప్పుడు గగ్గోలు పెట్టిన చంద్రబాబు ఆ తరువాత ఏపీలో తానూ వైసీపీ విషయంలో అదే పని చేశారు. దీంతో ఫిరాయింపులకు వ్యతిరేకంగా తీర్మానం ఎలా ప్రవేశపెడతామన్నది ఏపీ టీడీపీ నేతల వాదన. అంతేకాదు... అసలు మహానాడులో టీటీడీపీ నేతలు ఎవరూ ఫిరాయింపులన్న మాటే ఎత్తరాదని అంటున్నారు.

దీంతో రేవంత్ కు మద్దతుగా మరికొందరు టీటీడీపీ నేతలు కూడా ఫిరాయింపుల విషయం లేకుంటే తెలంగాణలో టీడీపీ గురించి, టీఆరెస్ దారుణాల గురించి ఏం చర్చిస్తామని అంటున్నారు. మొత్తానికి  రెండు రాష్ట్రాల టీడీపీ మధ్య చిచ్చుగా మారుతోందని కొందరు అంటున్నారు. రేవంత్ ఈ విషయంలో పట్టుదలగా ఉన్నారని.. నేరుగా చంద్రబాబుతోనే దీనిపై మాట్లాడడానికి సిద్ధపడుతున్నారని తెలుస్తోంది. అయితే, అక్కడా ఆయనకు చుక్కెదురు కావడం ఖాయమన్న సంగతి తెలిసిందే.
Tags:    

Similar News