తాత్కాలిక రాజధాని : డేట్ మారింది

Update: 2015-08-27 03:25 GMT
విజయవాడలో తాత్కాలిక రాజధానిని ప్రారంభించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పాల‌న అక్క‌డినుంచి కొన‌సాగించాల‌ని భావిస్తున్న ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆచ‌ర‌ణ‌కు వాస్త‌విక ప‌రిస్థితులు అడ్డంకిగా నిలుస్తున్నాయి. ఈ క్ర‌మంలో ప‌లు సంద‌ర్భాల్లో ప్రారంభం తేదీలు మారిపోయాయి. తాజాగా కొత్త ముహూర్తం ఖరారైంది.

ఈ ఏడాది ద‌స‌రా నుంచి తాత్కాలిక రాజ‌ధాని పాల‌న షురూ చేయాల‌ని భావిస్తున్నారు. అంటే అన్నీ కుదిరితే అక్టోబర్‌ 22వ తేదీ నుంచి కార్య‌క‌లాపాలు కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించారు. ఆ రోజుకు కొన్ని శాఖలనైనా హైదరాబాద్‌ నుంచి బదిలీ చేసి తాత్కాలిక రాజ‌ధాని నుంచే పని చేసేలా చూడాలన్నది ప్రభుత్వం ఆలోచ‌న‌గా ఉన్న‌ట్లు స‌మాచారం.

మ‌రోవైపు కొత్త రాజధాని శంఖుస్థాపనకు వస్తున్న ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ చేతులమీదుగా తాత్కాలిక రాజధానికి కూడా ప్రారంభోత్సవం చేయించాలని ప్రభుత్వ వర్గాలు అనుకొంటున్నాయి. అయితే ఈ ఆలోచనలన్నీ ఉద్యోగుల సహకారంపై ఆధారపడి ఉండటంతో ప్రభుత్వ వర్గాలు సందిగ్దంలో ప‌డిపోయాయి. అందుకే ఉద్యోగుల మనోగతం తెలుసుకొనే ప్రయత్నంలో ఉన్న‌తాధికారులు, ప్ర‌భుత్వ వ‌ర్గాలు ఉన్నాయి. మొత్తంగా ద‌స‌రా నుంచే తాత్కాలిక‌ రాజ‌ధాని అందుబాటులోకి రావ‌డం మంచి ప‌రిణామ‌మ‌ని ఏపీ ప్ర‌జ‌లు భావిస్తున్నారు.
Tags:    

Similar News