ఏపీలో కేసీఆర్‌ కు పాలాభిషేకం..కార‌ణం స్పెష‌ల్‌

Update: 2018-01-09 04:30 GMT
తెలంగాణ‌ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు స‌హా ఆయ‌న పార్టీ నేత‌లు - అభిమానులు ఆశ్చ‌ర్య‌చ‌కితులు - ఆనందభ‌రితులు కావాల్సిన అంశమిది. ఎందుకంటే...సీమాంధ్రతో క‌లిసి ఉండ‌టానికి వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్‌ కు ఏపీలో ప్రజలు ఇప్పుడు పాలాభిషేకం చేయడానికి సిద్ధమవుతున్నారు. స్వరాష్ట్రంలోనే కాదు... పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ లోనూ కేసీఆర్‌ కు ఉన్న అభిమానానికి ఇది నిద‌ర్శ‌నం. ఇంత‌కీ ఆంధ్రప్రదేశ్‌ లో తెలంగాణ సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం ఎక్కడ చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అంటే కేసీఆర్ మార్క్ నిర్ణ‌యాల‌తోనే!

గొల్ల - కురుమ‌ల సంక్షేమంపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్  ఈ క్ర‌మంలో తెలంగాణలోని యాదవ సామాజికవర్గానికి రాజ్యసభ టికెట్‌ ఇస్తానని హామీ ఇచ్చారు. నగర శివార్లలో యాదవ - కురవ భవన నిర్మాణానికి పది ఎకరాలు - రూ.10 కోట్లను ఆయన కేటాయించారు. ఈ చ‌ర్య‌ను గొల్ల‌ - కురుమ‌లంతా ప్ర‌శంసించారు. ఏకంగా క‌ర్ణాట‌క కాంగ్రెస్‌ మంత్రి కూడా దీన్ని కొనియాడిన సంగ‌తి తెలిసిందే. ఇదే కోవ‌లో ఏపీలోని ప‌లువురు యాద‌వుల నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. దీనికి కొన‌సాగింపు అన్న‌ట్లుగా యాదవుల సామాజికవర్గాన్ని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్‌ ఈ సామాజికవర్గానికి చేస్తున్న సేవకు గుర్తింపుగా నేడు విజయవాడలో పెద్దఎత్తున ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేయాలని ఏపీ యాదవ సంఘం నిర్ణయించింది. యాదవ యువభేరీ అధ్యక్షుడు లక్కనబోయిన వేణు - కొలుసు సతీష్‌ యాదవుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది.

యాదవులకు రాజ్యసభ - కురవలకు ఎమ్మెల్సీ స్థానాన్ని ఇస్తానని ప్రకటించిన కేసీఆర్‌ భవిష్యత్తులో తమ సామాజికవర్గానికి అండగా నిలబడతారన్న ఉద్దేశంతోనే ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నామని వారు తెలిపారు. యాదవులు - గొర్రె కాపరులకు సబ్సిడీ రుణాలు అందిస్తున్న కేసీఆర్‌ తమ ప్రియతమ నేత అని ఆయన కృతజ్ఞతాంజలి అర్పిస్తున్నామని చెప్పారు. మంగళవారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని ప్రెస్‌ క్లబ్‌ లో పాలాభిషేకం కార్యక్రమం జరుగుతుందని ఈ కార్యక్రమంలో యాదవులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కొలుసు సతీష్‌ యాదవ్‌ కోరారు. మొత్తానికి కేసీఆర్‌కు తెలంగాణలోనే కాకుండా సీమాంధ్రలో కూడా పాలాభిషేకం ట్రెండ్‌ మొదలుకావడంతో రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌ గా మారింది.


Tags:    

Similar News