సంక్రాంతి నాటికి 28 జిల్లాలుగా ఏపీ?

Update: 2017-12-11 06:05 GMT
ఏపీ ప్రభుత్వం కూడా తెలంగాణలోని కేసీఆర్ గవర్నమెంటు బాటలో సాగేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. కొత్త జిల్లాలను ఏర్పాటుచేయడానికి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల సంఖ్యను 28కు పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. సంక్రాంతి నాటికి జిల్లాల విభజనకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీ చేయొచ్చని తెలుస్తోంది.
    
దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో ఇప్పటికే మాట్లాడారని.. విభజనకు సంబంధించిన కసరత్తును ప్రారంభించాలని ఆదేశించారని తెలుస్తుంది. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటు ఏ విధంగా ఉండబోతోందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో... ముఖ్యంగా వాట్సాప్‌ లో ఒక మెసేజ్ కూడా స్ర్పెడ్ అవుతోంది. అందులో 27 జిల్లాలు చేసే ప్రతిపాదన ఉన్నట్లుగా పేర్కొంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో అదనంగా పాలకొండ - విజయనగరంలో పార్వతీపురం - తూర్పుగోదావరిలో కాకినాడ - అమలాపురం.. పశ్చిమలో ఏలూరు - కృష్ణాలో గుడివాడ - మచిలీపట్నం..  గుంటూరులో పొన్నూరు - నరసరావుపేట.. ప్రకాశంలో కందుకూరు.. కడపలో పులివెందుల - చిత్తూరులో తిరుపతి..  కర్నూలులో నంద్యాల జిల్లాలు కొత్తగా ఏర్పడతాయని అందులో చెబుతున్నారు. అయితే.. కృష్ణాలో గుడివాడ - మచిలీపట్నం రెండు పక్కపక్కనే జిల్లాలుగా చేయడం అసాధ్యం. పైగా కొత్తగా అమరావతి జిల్లా ఏర్పడొచ్చన్న అంచనాలున్నాయి. మరోవైపు విస్తీర్ణంలో పెద్దదైన అనంతపురం జిల్లా విభజన ప్రస్తావనా ఇందులో లేదు.
    
దీంతో ఈ మెసేజ్‌ ను ఎవరూ పెద్దగా పట్టించుకోనప్పటికీ.. జిల్లాల విభజనకు కసరత్తు జరుగుతుండడం అయితే వాస్తవమని అధికారుల నుంచి వినిపిస్తోంది. పార్లమెంటు స్థానాల ప్రాతిపదికన జిల్లాలుగా మారుస్తారా లేక జనాభా ప్రాతిపదికన జిల్లాల కూర్పు జరగనుందా అనేది తెలియలేదు. పార్టీవర్గాల ప్రాథమిక సమాచారం మేరకు పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికనే ఈ కొత్త జిల్లాల కూర్పు ఉండబోతుందని తెలుస్తోంది.
Tags:    

Similar News