జగన్ 16 వేల పట్టాలు ఇస్తే... 16 ఇళ్ళు మాత్రమే పూర్తి అయ్యాయంటే...?

Update: 2022-11-30 09:56 GMT
ఏపీలో జగనన్న ఇళ్ళ కాలనీల పరిస్థితి ఎలా ఉంది అంటే ప్రచారం ఘనం, అమలు మాత్రం జీవితకాలం లేటు అన్నట్లుగా అని చెప్పాల్సిందే. మొత్తం ఏపీలో 31 లక్షల ఇళ్ళ పట్టాలు ఇచ్చారు. దేశంలోనే ఇది రికార్డు. ఇందులో తొలి విడతగా పదమూడు లక్షల ఇళ్ళను ఎన్నికల ముందు అయినా నిర్మించాలని చూస్తున్నారు. కానీ ఇప్పటికి పూర్తి చేసుకున్నవి ఈ రెండేళ్ళల్లో అక్షరాలా లక్షా నలభై అయిదు వేల ఇళ్ళు మాత్రమే. ఈ లెక్కన మొత్తం 31 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి కావడానికి ఎన్నేళ్ళు పడుతుంది అన్నది కీలకమైన ప్రశ్న.

ఇదిలా ఉంటే ఇప్పటికి రెండేళ్ల క్రితం ముఖ్యమంత్రి జగన్ స్వయంగా కాకినాడకు వచ్చి సమీపంలో కొమరగిరి కాలనీలో 2020 డిసెంబర్ 25న ఏకంగా 16,601 మంది లబ్దిదారులకు ఇళ్ళ పట్టాలు ఇచ్చారు. అలాగే అక్కడ పైలాన్ ఆవిష్కరించి సభను కూడా నిర్వహించారు.

మరి రెండేళ్ళు గిర్ర్రున తిరిగేసరికి అక్కడ పూర్తి అయిన ఇళ్ళను    చూస్తే కేవలం పదహారు మాత్రమే కనిపిస్తాయ్. మరో 24 ఇళ్ళు స్లాబుల దాకా వచ్చాయి. స్లాబుల ఎత్తు దాకా పూర్తి చేసుకున్న ఇళ్ళు మరో 29 ఉంటే, పునాదులు మాత్రమే నిర్మించి వదిలేసినవి 487 ఉన్నాయి. ఇవన్నీ తీసుకున్నా ఆరు వందల లోపు మాత్రమే.

మరి సీఎం జగన్ ఇచ్చిన 16,601 ఇళ్ళలో మిగిలిన పదహారు వేల ఇళ్ళ సంగతి ఏంటి అంటే వీటిని అలాగే వదిలేసి లబ్దిదారులు ఊరుకున్నారు. దానికి కారణం ఏంటి అంటే ఈ ప్రతిపాదిత కాలనీ నుంచి కాకినాడకు చేరుకోవాలీ అంటే ఏకంగా పదహారు కిలోమీటర్ల దూరం వెళ్లాలి. మరి రెక్కాడితే కాని డొక్కాడని బడుగు జీవులు కాకినాడ వంటి పట్టణంలో ఉపాధి చూసుకోకుండా ఇక్కడకు వచ్చి ఎలా ఉండగలరు అన్నది ప్రధానమైన విషయంగా ఉంది.

అదే విధంగా చూసుకుంటే కొందరికి జాతీయ రహదాని పక్కన బాగానే స్థలాలు దొరికాయి. వారి పని బాగుంది. కానీ చాలా మందికి ఎక్కడో విసిరేసినట్లుగా గుంటలలో లోతట్టు ప్రాంతాలలో ఇళ్ల పట్టాలు ఇచ్చారు. సముద్ర తీరం కావడంతో తమకు అక్కడ ఇలాంటి స్థలాలు చూపిస్తే రేపటి రోజున ఇళ్ళు కట్టుకుని ఎలా ఉంటామని చాలా మంది నిరుత్సాహ పడుతున్నారు. దాంతో అవి అలాగే ఉండిపోయాయని తెలుసోంది.

మరో వైపు చూస్తే దూరంగా విసిరేసినట్లుగా ఈ కొమరగిరి కాలనీలో మౌలిక సదుపాయాలు లేవు. మంచి నీరు, విద్యుత్ రోడ్డు వంటివి ఉంటే కనుక కచ్చితంగా చాలా మంది వచ్చి ఉంటారు. కానీ ప్రభుత్వం వాటిని ముందే కల్పించాల్సి ఉండగా ఈ రోజుకీ అవి లేవు. ఇంకో వైపు ప్రభుత్వం ఇచ్చిన డబ్బు సరిపోవడంలేదు, లబ్దిదారులు మరింతగా వేసుకొవాల్సి వస్తోంది. అలా లేని వారు కూడా ఇళ్ల నిర్మాణానికి ఆసక్తి లేక ఆగిపోతున్నారు.

ఈ ఇళ్ల విషయంలో అధికారులు పై స్థాయి నుంచి వత్తిడి పెడుతున్నా ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన వాటా నిధులు రాక చాలా మంది ఊరుకున్నారని తెలుస్తోంది. మేము ఇళ్ళు కట్టిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం నిధులను కూడా విడుదల చేయాలి కదా అని అంటున్నారు. మరో వైపు కచ్చితంగా ఇక్కడ గడువు లోగా 13 వేల ఇళ్ల నిర్మాణం చేపడతామని అధికారులు చెబుతున్నా ఆ దిశగా ఆశించిన మేర ఫలితాలు అయితే రావడం లేదు అంటున్నారు.

లబ్దిదారులను కట్టుకోమని చెబితే ప్రభుత్వమే కట్టించాలని వారు అంటున్నారు. దాంతో కాంట్రాక్టర్లకు ఈ కాలనీలో ఇళ్ల నిర్మాణం పనులను ప్రభుత్వం అప్పగించింది అని చెబుతున్నారు. అయితే ఎంతటి కాంట్రాక్టర్ అయినా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తేనే కదా కట్టగలరు. ప్రతీ ఇంటినీ మూడు లక్షల రూపాయలకు తక్కువ కాకుండా కట్టుదిట్టంగా కట్టాలని సర్కార్ వారు ఆదేశాలు ఇస్తున్నారు కానీ నిధులు రాలడంలేదు అని కాంట్రాక్టర్ల నుంచి వస్తున్న జవాబు.

ఇక ప్రభుత్వం నుంచి వస్తున్న వత్తిడి వల్ల ఒకేసారి 8,500 ఇళ్ల నిర్మాణానికి నెల్లూరుకి చెందిన జేఎన్ఆర్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ రంగంలోకి దిగింది అని అంటున్నారు. ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తే చాలా మంది ఇళ్ళను కట్టుకునేవారు అని కాంట్రాక్టర్ల నుంచి కూడా వస్తున్న మాట. అలాగే నిధులను కూడా ఎప్పటికపుడు విడుదల చేయాలని అంటున్నారు.

మరో వైపు చూస్తే ఎదురుగా సాగర తీరం ఉంది. అందువల్ల ఇళ్ళను నాసిరకంగా కట్టవద్దు అని లబ్దిదారులు అంటున్నారు. తుఫాన్ల ముప్పు ఉన్నందువల్ల ఇళ్ళను దిట్టంగా కట్టాలి తప్ప గడువు పెట్తుకుని ఏదో కట్టామని కడితే సరిపోదు అని అంటున్నారు. ఇన్ని అవాంతరాల మధ్యన ఈ ఇళ్ళు ఎప్పటికి పూర్తి అవుతాయన్నది ఎవరూ చెప్పలేకపోతున్నారు. మొత్తానికి చూస్తే మాటలు కోటలు దాటుతున్నా చేతలు మాత్రం ఎక్కడో ఉన్నాయని చెప్పడానికి ముఖ్యమంత్రి స్వయంగా ప్రారంభించిన కొమరగిరి కాలనీయే ఉదాహరణ అని అంటున్నారు. సో ఈ కాలనీలో పూర్తి ఇళ్ళు ఎపుడు పూర్తి అవుతాయంటే వేచి చూడాల్సిందే అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News