వైసీపీ పక్కన టీడీపీని చేర్చేసిన సేనాని...?

Update: 2022-11-26 07:30 GMT
ఆ రెండు పార్టీలు అంటూ కొత్త పాట జనసేన పాడుతోంది. తాము ఏపీలో బలంగా ఎదుగుతూంటే ఆ రెండు పార్టీలకు మంటగా ఉంటోంది అని జనసేన ఉప సేనాని నాదెండ్ల మనోహర్ హాట్ హాట్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చేశారు. ఏపీలో తమ ఎదుగుదల వారికి కంటగింపుగా మారింది అని ఆయన ఆడిపోసుకుంటున్నారు. దీని భావమేమి పవనేశా అంటే ఏముంది ఏపీలో థర్డ్ ఆల్టర్నేషన్ తానేనని జాతి జనులకు విప్పి చెప్పడం. ఆ మీదట వారి కరుణతో అధికార పీఠాన్ని అందుకోవడం.

అంటే ఒక విధంగా చూస్తే జనసేన సైడ్ నుంచి క్లారిటీ ఎంతో కొంత వచ్చినట్లే. నాదెండ్ల మనోహర్ విజయనగరం జిల్లా టూర్ లో ప్రస్తుతం ఉన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేనకు పొత్తులు ఎవరితో ఉన్నాయో అన్న విషయం తామే అఫీషియల్ గా ప్రకటిస్తామని చెప్పారు. మీకు ఎందుకు కంగారు అంటూ ప్రత్యర్ధి పార్టీల మీద చికాకు పడ్డారు. తమ పార్టీ పారదర్శకంగా ఉంటుందని, నిజంగా ఫలానా  పార్టీతో పొత్తులు ఉంటే తాము గట్టిగానే బయటకు చెబుతామని ఆయన అంటున్నారు.

ఇందులోనూ ఆలోచిస్తే బోలెడంత విషయం ఉంది. అదేంటి అంటే పొత్తులు తమకు ఇప్పటిదాకా ఏపీలో ఎవరితోనూ లేవు అని. మరి ఆ జాబితాలో మిత్రపక్షం బీజేపీ వస్తుందో లేదో తెలియదు. కానీ నాదెండ్ల నోట కానీ పవన్ మాటలో కానీ బీజేపీ ఎపుడూ దొర్లదు. అందువల్ల ప్రస్తుతానికి జనసేన సింగిల్ అనే అనుకోవాలి. ఒంటరిగానే తన అవకాశాలను వెతుక్కునే పనిలో ఉంది అని కూడా భావించాలి.

సొంతంగా తాము బలపడి ఎన్నికల్లో సోలోగా పోటీ పడాలని జనసేన ఆలోచనలు ఉన్నాయని ఈ మధ్య తరచూ ప్రచారం సాగుతోంది. ఒక వేళ ఎన్నికల నాటికి కలసి వస్తే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కేంద్ర స్థాయిలో తమకు సహాయ సహాకారాలు ఉంటాయని కూడా ఒక వ్యూహం ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇక ఏపీలో చూస్తే తెలుగుదేశంతో జనసేన పొత్తు అన్న దానికి మాత్రం నాదెండ్ల తాజా వ్యాఖ్యలు కొంతవరకూ చెక్ చెప్పేశాయనే అనుకోవాలి.

విజయవాడలో ఆ మధ్య ఒక హొటల్ లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలసి వచ్చారు. వైసీపీ మీద పోరాడడానికి తాము అంతా ఏకమవుతామని బాబు చెప్పారు. కానీ ఆనాడు మీడియా ముందు కూడా పవన్ టీడీపీతో కలసి పోరాటం చేస్తామని గట్టిగా చెప్పలేదు. అది జరిగి నెలన్నర అవుతున్నా పవన్ నోట తెలుగుదేశం మాట సైతం రావడం లేదు.

దాంతో నాదెండ్ల తాజా ప్రకటనను ఆ విధంగా కనుక చూసుకుంటే ఏపీలో టీడీపీతో కలిసే వీలు లేదనే చెప్పినట్లుగా ఉంది అంటున్నారు. మరో వైపు చూస్తే తనకు వచ్చే ఎన్నికలు చివరి చాన్స్ అని చంద్రబాబు అంటున్నారు. ఆయనకు చివరి చాన్స్ అయితే పవన్ కి ఏపీ రాజకీయాల్లో ఫుల్ స్పేస్ దొరుకుంది. అందువల్ల ఆయనకు అది లక్కీ చాన్స్ అవుతుంది అని అంటున్నారు. ఈ విషయాల మీద పూర్తి అవగాహనతో ఉన్న పవన్ కళ్యాణ్ అందుకో విజయనగరం జిల్లా టూర్ లో టోన్ మార్చి తనకు ఒక్క చాన్స్ అంటూ బిగ్ సౌండ్ చేశారు.

ఈ రెండూ యాధృచ్చికంగా సాగినా పవన్ మాటలను బట్టి చూస్తే కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తాను డిసైడింగ్ ఫ్యాక్టర్ కావాలన్న ఆరాటం కనిపిస్తోంది. బహుశా ఈ కారణంతోనే ఆయన నాదెండ్ల మనోహర్ చేత ఈ రకమైన ప్రకటన ఇప్పించారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే నాదెండ్ల తాజా ప్రకటనతో ఏపీలో పొత్తుల ఆప్షన్ ని జనసేన పక్కన పెట్టేసినట్లుగా ఉందని అర్ధమవుతోంది. ఇది తెలుగుదేశానికి చేదు వార్తగానే చూడాలి. అదే సమయంలో బీజేపీ మిత్రుడుగా పవన్ ఉంటారా అన్నది కూడా ఇప్పటికీ తేల్చలేదు కానీ ముందు ముందు దాని మీద క్లారిటీ వచ్చే చాన్స్ ఉంది.

ఇంకో వైపు చూస్తే తెలుగుదేశం పార్టీ చివరాఖరు ఆశలు ఇంకా మిగిలి ఉన్నాయని అంటున్నారు. డిసెంబర్ 5న ఢిల్లీలో జరిగే మీటింగ్ లో మోడీ అపాయింట్మెంట్ కోసం చంద్రబాబు చూస్తున్నారు. మోడీ కనుక అపాయింట్మెంట్ ఇస్తే ఏపీలో టీడీపీకి ఇంకా హోప్స్ ఉంటాయని అంటున్నారు. అది కనుక కుదరకపోతే సైకిల్ సోలోగానే ఎన్నికల్లో తలపడాల్సి ఉంటుంది అని చెబుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News