తెలంగాణ మద్యం.. ఏపీలో కిక్కు..

Update: 2019-11-16 09:10 GMT
దోమ యూనివర్సల్ కీటకం.. అది అందరినీ కుడుతుంది. అలానే మందుబాబులకు మందే కావాలి.. అది తెలంగాణదా.? ఏపీదా అని చూడరు.. ఎక్కడ చీప్ గా వస్తుంది? ఏది కిక్కిస్తుంది అని మాత్రమే చూస్తారు. ఈ పరిణామమే తెలంగాణ మందుకు గిరాకీ కనిపిస్తుండగా.. ఏపీ మద్యానికి గిరాకీ లేక వెలవెలబోయేలా చేస్తోంది.

ఆర్థిక మాంద్యమొచ్చినా.. అంతకంటే కరువు కకావికలం చేసినా సాయంత్రం అయితే మందుబాబుల నాలుక మాత్రం లాగేస్తుంటుంది. చుక్కలేనిదే చుక్కలు చూపిస్తారు. మద్యం తాగకపోతే గిలాగిలా కొట్టేసుకుంటారు. కానీ ఏపీలో మద్యం ధరలు పెరగడం.. రాత్రి 8 గంటలకే మూతపడుతుండడంతో పొద్దంతా పనిచేసొచ్చి  రాత్రిళ్లు తాగే మందుబాబులు ఇప్పుడు గిలాగిలా కొట్టుకుంటున్నారు. ప్రత్యామ్మాయంగా ఇప్పుడు తెలంగాణ బార్లు, వైన్స్ షాపులకు క్యూ కడుతున్నారు.

ఇప్పుడు తెలంగాణ మద్యం ఏపీలో కిక్కిస్తోంది. ఏపీ సరిహద్దుకు ఆనుకొని ఉన్న ఖమ్మం, నల్గొండ జిల్లాల  వైన్స్, బార్ల పంట పండుతోందట.. ఏపీలో మద్యం ధరలకు, తెలంగాణలో మధ్య ధరలకు క్వార్టర్ కు రూ.30-40 తేడా ఉంటోంది. ఇక ఫుల్ బాటిల్ కు అయితే ఏకంగా 150-200 వరకూ తేడా ఉంది. దీంతో తెలంగాణలో చీప్ గా దొరికే మద్యం కోసం ఏపీ సరిహద్దున గల మందుబాబులు ఎగబడుతున్నారు.

ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఆనుకొని ఉన్న కృష్ణ జిల్లాలోని జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు, నందిగామ, వీరులపాడు మండలాల వాసులంతా తెలంగాణ మద్యం షాపులకు క్యూ కడుతున్నారు. ఇక్కడ రాత్రి 11 గంటల వరకు మద్యం షాపులు తెరిచి ఉండడం.. పైగా ఏపీతో పోలిస్తే తక్కువ ధరకు మద్యం దొరకడంతో తెలంగాణ సరిహద్దు గ్రామాలకు వచ్చి మరీ కొనుక్కెళుతున్నారట.. ఇక కొందరు భారీగా మద్యం కొనుక్కొని బెల్ట్ షాపుల ద్వారా జనానికి అమ్ముకుంటూ సొమ్ముచేసుకుంటున్నారు.

అయితే తెలంగాణ సరిహద్దుల గుండా ఏపీకి మద్యం సరఫరా అవుతుండడంపై ఏపీ ఎక్సైజ్ అధికారులు దృష్టిసారించారు.. ఇప్పటికే 203 బాటిళ్లను బోనకల్లులో సీజ్ చేశారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఇలా తెలంగాణలో చీప్ గా దొరికే మద్యం కోసం ఏపీ సరిహద్దు జిల్లాల వాసులు ఎగబడుతుండడం తెలంగాణ ఎక్సైజ్ శాఖకు కాసులు కురిపిస్తోంది. ఏపీ వైన్స్ లకు మాత్రం ఆదరణ తగ్గుతోందట..
Tags:    

Similar News