ఉల్లిగడ్డ ఒబామా అంటున్న న్యూస్ ఛానల్

Update: 2016-01-12 08:49 GMT
అమెరికాలో పెరిగిపోతున్న తుపాకీ సంస్కృతిని అరికట్టడానికి సంబంధించి ఆ దేశ అధ్యక్షుడు ఒబామా వారం కిందట వైట్ హౌస్ నుంచి ఉద్వేగభరిత ప్రసంగం చేసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఆయన ఒక పాఠశాలలో 20 మంది చిన్నారులన తుపాకితో కాల్చేసిన సంఘటనను గుర్తు తెచ్చుకుని బాధతో ఏడ్చేశారు. ఆయన కంటి వెంట ధారాపాతంగా నీరు కారడం ప్రపంచమంతా చూసింది. ఆయన కళ్లు తుడుచుకుంటూనే తన ప్రసంగాన్ని కంటిన్యూ చేశారు. అగ్రరాజ్యం అధినేత అలా కదిలిపోయి కన్నీళ్లు పెట్టుకునే సరికి అమెరికాయే కాదు ప్రపంచమంతా కూడా అయ్యో పాపం ఒబామాది ఎంత సున్నిత మనసు అనుకున్నారు. అయితే... ఆయన కంటతడి సహజమైనది కాదని.. కృత్రిమమైనదని.. ఉల్లి పాయ ఘాటు వల్ల ఆయన కన్నీళ్లు పెట్టారని ఆయన ప్రత్యర్ధులు, రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు.

  ''ఒబామాది నటన.. ఆయన కన్నీళ్లు పెట్టుకున్నట్టుగా నటించారంతే'' అని కన్జర్వేటివ్ పొలిటికల్ ఎనలిస్ట్ - ఫాక్స్ న్యూస్‌ ఛానల్ వ్యాఖ్యాత ఆండ్రియా టాంటెరోస్ ఆరోపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన నిజంగా కన్నీళ్లు పెట్టుకోలేదన్న అనుమానాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆమె కన్నీళ్లు తెచ్చుకోవడానికి ఆయన ఉల్లిపాయ వాడారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. 'ఒబామా మాట్లాడిన తర్వాత వేదిక వద్ద ఉల్లిపాయ లేదా టియర్ గ్యాస్ వంటివి ఉన్నాయేమో చూడాల్సింది అన్నారు. ''ఒబామా కన్నీళ్లు పెట్టుకున్నారంటే నమ్మబుద్ధి కావడం లేదు. అసలే ఇది అవార్డుల సీజన్'' అంటూ ఆమె ఒబామాకు ఆస్కార్ ఇవ్వాలన్న ఉద్దేశంతో వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.  చర్చలో పాల్గొన్న మిగతావారూ అలాంటి అనుమానమే వ్యక్తంచేశారు.

అయితే...ప్రపంచవ్యాప్తంగా దాన్ని చూసినవారు మాత్రం  ఒబామా ఏడుపు సహజమైనదే అంటున్నారు. ఉల్లి కానీ, ఇంకేదైనా కానీ ఉంటే అక్కడున్న మిగతావారి కంటి నుంచి కూడా నీరు రావాలని అంటున్నారు. అంతేకాదు... ఉల్లి కారణంగా కన్నీళ్లు రావడంతో పాటు కళ్లు విప్పి చూడలేని పరిస్థితి కూడా వస్తుందని... కానీ, ఒబామా కంటి నుంచి నీరు మాత్రమే వచ్చాయని.. ఆయనకు భావోద్వేగం కారణంగానే కన్నీళ్లు వచ్చాయని మద్దతు పలుకుతున్నారు. కాగా ఒబామాపై ఫాక్స్ న్యూస్‌ ఛానల్ లో విమర్శలు కొత్త కాదు. గతంలోనూ ఒబామాపై ఆ ఛానల్ లో ఇలాంటి ఎన్నో విమర్శలు వచ్చాయని చాలామంది కొట్టిపారేస్తున్నారు.
Tags:    

Similar News