సైనాకు షాకిచ్చి మోడీ బ్యాచ్ ఏం సాధిస్తారో?

Update: 2018-04-03 04:16 GMT
కీల‌క టోర్నీలు జ‌రుగుతున్న‌ప్పుడు క్రీడాకారులు ఒత్తిడి గురి కాకుండా మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ.. అలాంటివేమీ మోడీ స‌ర్కారుకు ప‌ట్ట‌న‌ట్లుంది. ఏదైనా టోర్నీ గెలిచినంత‌నే ప్ర‌ధాన‌మంత్రి మోడీ ట్విట్ట‌ర్ అకౌంట్లో ట్వీట్ చేసి అభినందిస్తే స‌రిపోతుంద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. క్రీడాకారుల క‌ష్టాల గురించి అస్స‌లు ప‌ట్ట‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో పాల్గొనే క్రీడాకారుల‌కు త‌మ చిత్ర‌..విచిత్ర‌మైన నిర్ణ‌యాల‌తో చుక్క‌లు చూపిస్తున్న క్రీడా మంత్రిత్వ శాఖ తాజాగా చేసిన ప‌ని చూస్తే ఒళ్లు మండ‌క మాన‌దు. కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో పాల్గొనే క్రీడాకారుల కుటుంబ స‌భ్యుల‌కు అనుమ‌తి ఇచ్చే విష‌యంలో జ‌రుగుతున్న ప‌రిణామాలు చూస్తే.. ప‌త‌కాలు గెల‌వ‌టానికి వెళ్లినోళ్ల ఆత్మ‌స్థైర్యాన్ని దెబ్బ తీయ‌టానికి అధికారులు తాము చేయ‌గ‌లిగినదంతా చేస్తున్నట్లుగా క‌నిపించ‌క మాన‌దు.

కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో పాల్గొనే అథ్లెట్ల కుటుంబ స‌భ్యుల్ని వారితో ఉండేందుకు అనుమ‌తి ఇవ్వ‌ని అధికారుల తీరుపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. దీంతో.. కాస్త వెన‌క్కి త‌గ్గిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన క్రీడా మంత్రిత్వ శాఖ అధికారులు త‌మ వ‌క్ర బుద్ధిని మ‌ళ్లీ ప్ర‌ద‌ర్శించారు. జాబితాలో సైనాతో ఆమె తండ్రి వెళ్లేందుకు అనుమ‌తిని అధికారులు ఇచ్చారు. సైనా త‌న తండ్రిని వెంట‌బెట్టుకొని వెళ్లేందుకు అవ‌స‌ర‌మైన మొత్తాన్ని ఆమె భ‌రించాల్సి ఉంటుంది.

ఇందుకు ఓకే అన్న సైనాకు.. ఆమె తండ్రిని వెంట తీసుకెళ్లేందుకు అనుమ‌తి ఇచ్చారు. కానీ.. కామ‌న్వెల్త్ క్రీడా గ్రామానికి చేరుకునేస‌రికి సీన్ మారిపోయింది. సైనా తండ్రి జాబితాలో క‌నిపించ‌కుండా పోయింది. ఎందుకిలా? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పే వారు క‌నిపించ‌ట్లేదు. కీల‌క టోర్నీకి ముందు మాన‌సికంగా ప్ర‌భావితం చేసే ఇలాంటి చ‌ర్య‌తో న‌ష్టం భార‌త్ కే అన్న విష‌యం మ‌ర్చిపోకూడ‌దు.

ఈ వ్య‌వ‌హారంపై సైనా ఘాటుగా స్పందించారు. త‌న‌కు ఎదురైన చేదు అనుభ‌వాన్ని ఆమె ట్విట్ట‌ర్ లో పంచుకున్నారు. కామ‌న్వెల్త్ క్రీడ‌లకు వెళ్లే ముందు మా నాన్న పేరు.. జ‌ట్టు అధికారిక జాబితాలో ఉంది. అందుకు అయ్యే ఖ‌ర్చుల‌ను కూడా మేమే చెల్లించాం. కానీ.. క్రీడాగ్రామానికి వ‌చ్చేస‌రికి జాబితాలో పేరును అధికారులు తీసేశారు. నా తండ్రి నాతో ఉండ‌టానికి వీల్లేదు.. నా మ్యాచ్ ల‌నూ ఆయ‌న చూడ‌లేరు.. క్రీడా గ్రామంలోకి ప్ర‌వేశించ‌లేరు.. న‌న్ను క‌ల‌వ‌లేరు.. ఇది నాకెలాంటి స‌హ‌కారం అంటూ వాపోయారు.

కీల‌క‌మైన టోర్నీల్లో క్రీడాకారులు రాణించాలంటే వారు మాన‌సిక ప్ర‌శాంత‌తో పాటు.. వారికి సంబంధించిన అన్ని అంశాలు చూసుకోవ‌టానికి వారంటే బాగా తెలిసిన మ‌నిషి అవ‌స‌రం ఎంతో. ఈ చిన్న విష‌యాన్ని క్రీడా మంత్రిత్వ శాఖ ఎందుకు ప‌ట్టించుకోవ‌టం లేదు?  చూస్తుంటే.. భార‌త్ కు ప‌త‌కాలు తీసుకురావ‌టం మోడీ స‌ర్కారుకు పెద్ద‌గా ఇంట్ర‌స్ట్ లేన‌ట్లుంద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.టాప్ ప్లేయ‌ర్ల‌తో ఈ త‌ర‌హాలో ఆడేస్తున్న క్రీడా మంత్రిత్వ శాఖ‌.. మిగిలిన క్రీడాకారుల విష‌యంలో మ‌రెంత దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారో..?
Tags:    

Similar News