అనిల్ అంబానీకి ఎన్టీఆర్ ఆద‌ర్శం

Update: 2016-01-11 05:57 GMT
పెట్టుబ‌డులకు విశాఖ‌ప‌ట్నం చాలా సుర‌క్షిత‌మైన ప్రాంత‌మ‌ని ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త అనిల్ అంబానీ పేర్కొన్నారు. ఆదివారం విశాఖ‌ప‌ట్నంలో జ‌రిగిన సీఐఐ స‌ద‌స్సులో ఆయ‌న మాట్లాడారు. ఎక్క‌డ శాంతి భ‌ద్రత‌లు అదుపులో ఉంటాయో అక్క‌డే అభివృద్ధి సాధ్య‌మ‌ని ఆయ‌న తెలిపారు. ఈ సంద‌ర్భంగా అనిల్ అంబానీ దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి - టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ పేరు ప్ర‌స్తావిస్తూ ఆయ‌న త‌న‌కు త‌న తండ్రి ధీరూబాయ్ అంబానీలా అద‌ర్శ‌నీయ‌మైన వ్య‌క్తి అని కొనియాడారు.  ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతలున్న చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుందన్న ఆకాంక్ష‌ను ఆయ‌న వ్య‌క్తం చేశారు.

  హైద‌రాబాద్‌ లో బిజినెస్ స్కూల్ అభివృద్ధికి చంద్ర‌బాబు చేసిన కృషే కార‌ణ‌మ‌న్నారు. విశాఖ‌లో ప్ర‌పంచంలోనే అత్యంత ప‌టిష్ట‌మైన నేవి హెడ్‌క్వార్ట‌ర్స్ ఉన్నాయ‌ని అనిల్ అంబానీ వ్యాఖ్యానించారు. కోస్తా తీరం మొత్తాన్ని నేవీ ఇక్క‌డ‌నుంచే ప‌ర్య‌వేక్షిస్తుంద‌ని...ఇది అత్యంత కీల‌క‌మైన‌, వ్యూహాత్మ‌క ప్రాంత‌మ‌ని ఆయ‌న చెప్పారు. విశాఖ‌ప‌ట్నం పెట్టుబ‌డుల‌కు ఎంత అనుకూల‌మో సీఎం చంద్ర‌బాబు ఆయ‌న కుమారుడు లోకేష్ త‌న‌కు వివ‌రించార‌ని అంబానీ తెలిపారు. పారిశ్రామిక వేత్త‌లు ఇక్క‌డ పెట్టుబ‌డులు పెడితే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ మేకిన్ ఇండియా కార్య‌క్ర‌మాన్ని కూడా ప‌రిపుష్టి చేసిన వార‌వుతార‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. సీఎం చంద్ర‌బాబు ఏపీ అభివృద్ధికి, భ‌విష్య‌త్తుకు ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళుతున్నార‌ని కొనియాడిన ఆయ‌న, ప్రధాని నరేంద్రమోడీని మిషన్ ఇంపాజిబుల్‌ గా అభివ‌ర్ణించారు.
Tags:    

Similar News