అంబానీకి పైసా అప్పు పుట్ట‌ట్లేద‌ట‌!

Update: 2019-06-12 04:39 GMT
మీరు మ‌రీనూ.. అంబానీకి పైసా అప్పు పుట్ట‌ట్లేదా? అన్న డౌట్ అక్క‌ర్లేదు. ఇది అక్ష‌రాల నిజం. అది కూడా ఎవ‌రో చెప్పింది కానీ.. ఆయ‌నే స్వ‌యంగా చెప్పిన సంచ‌ల‌న విష‌యమిది. రిల‌య‌న్స్ గ్రూపు ఛైర్మ‌న్ అనిల్ అంబానీ ఉన్నాడు క‌దా.. ఆ పెద్ద మ‌నిషి పీక‌ల్లోతు అప్పుల్లో మునిగిపోయారు. అలాంటి ఆయ‌న‌కు బ‌య‌ట ఇప్పుడు ఒక్క పైసా అప్పు పుట్ట‌ట్లేద‌ట‌. దీంతో..ఆస్తులు అమ్మి అయినా అప్పులు చెల్లిస్తామ‌ని భ‌రోసా ఇచ్చారు.

వీలైనంత వ‌ర‌కూ అప్పులు త‌గ్గించుకునేందుకు అవ‌స‌ర‌మైన అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తామ‌ని చెప్పారు. గ‌డిచిన 14 నెల‌ల్లో తాను రూ.35వేల కోట్ల అప్పులు తీర్చిన‌ట్లు చెప్పారు. రానున్న రోజుల్లో కూడా అప్పుల్ని తీర్చే విష‌యంలో క‌ట్టుబ‌డి ఉంటానన్నారు. ఆర్ కామ్ స‌హా గ్రూపులోని మిగిలిన కంపెనీలు ప్ర‌తికూల ప‌రిస్థితుల్ని ఎదుర్కొంటున్న నేప‌థ్యంలో ఆస్తుల అమ్మ‌కం ద్వారా చెల్లింపుల ప్ర‌క్రియ‌ను పూర్తి చేయ‌నున్న‌ట్లు చెప్పారు. 

రుణ సంక్షోభంతో పాటు.. గ‌డిచిన కొన్ని నెల‌లుగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాల కార‌ణంగా అనిల్ అంబానీ నేతృత్వంలోని రిల‌య‌న్స్ గ్రూపు సంస్థ షేర్ల విలువ భారీగా ప‌డిపోవ‌టంతో ప‌రిస్థితి మ‌రింత ఇబ్బందిక‌రంగా మారింది. ఒక అంచ‌నా ప్ర‌కారం జ‌న‌వ‌రి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ రిల‌య‌న్స్ షేరు ధ‌ర 65 శాతం వ‌ర‌కు మార్కెట్ విలువ‌ను కోల్పోవ‌టంతో ఇబ్బందులు మ‌రింత పెరుగుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో రుణ‌దాత‌ల‌కు భ‌రోసా ఇచ్చేలా అనిల్ అంబానీ వ్యాఖ్యానించారు. ఒక‌వైపు ఊహాగానాల వ‌ల్ల షేర్ల‌కు న‌ష్టాలు వ‌స్తుంటే.. మ‌రోవైపు త‌మ‌కు రావాల్సిన అప్పులు వ‌సూలు కాక‌పోవ‌టం మ‌రో ఇబ్బందిగా మారింది. వీట‌న్నింటికి మించి బ్యాంకులు.. మ్యూచువ‌ల్ ఫండ్ లు.. భ‌విష్య‌నిధి సంస్థ‌లు ఇలా ఏ ఆర్థిక సంస్థ కూడా పైసా అప్పు ఇచ్చేందుకు ముందుకు రాక‌పోవ‌టంతో ఇబ్బందిక‌రంగా మారిన‌ట్లు వెల్ల‌డించారు.

ఒక అంచ‌నా ప్ర‌కారం అనిల్ అంబానీ నేతృత్వంలోని కంపెనీల మొత్తం అప్పు విలువ దాదాపు రూ.ల‌క్ష కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని చెబుతున్నారు. అందులో రూ.35,400 కోట్ల అప్పులు ఇప్ప‌టివ‌ర‌కూ తీర్చారు. త‌న రుణ‌భారాన్ని తీర్చుకునేందుకు అనిల్ అంబానీ త‌న నేతృత్వంలోని బీమా వ్యాపారాన్ని కూడా అమ్మ‌కానికి పెట్టారు. అంతేకాదు.. త‌న అన్న‌తో రిల‌య‌న్స్ జియోతో స్పెక్ట్ర‌మ్ ను అమ్మేందుకు రూ.23వేల కోట్ల‌తో కుదుర్చుకున్న డీల్ లెక్క తేలితే.. రుణ‌భారం నుంచి మ‌రికాస్త రిలాక్స్ కావొచ్చు. ఓడ‌లు బండ్లు కావ‌టం అంటే ఇదేనేమో?
Tags:    

Similar News