మీడియాపై 10వేల కోట్ల ప‌రువు న‌ష్టం దావా వేసిన అనిల్ అంబానీ

Update: 2018-10-20 04:54 GMT
రాఫెల్ ఎపిసోడ్ లో మ‌రో ఆస‌క్తిక‌ర మ‌లుపు చోటు చేసుకుంది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించి త‌మ‌పై త‌ప్పుడు క‌థ‌నాలు ప్ర‌చురించిన‌ట్లుగా అనిల్ అంబానీకి చెందిన రిల‌య‌న్స్ కంపెనీలు ప‌రువు న‌ష్టం కేసులు వేశాయి. వివిధ జాతీయ‌.. అంత‌ర్జాతీయ మీడియా సంస్థ‌ల‌తో పాటు ప్రాంతీయ మీడియాల‌కు ఇందుకు సంబంధించిన నోటీసులు జారీ చేశారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఒక్కో కేసులో రూ.5వేల కోట్ల నుంచి రూ.10వేల కోట్ల వ‌ర‌కు ప‌రువు న‌ష్టం చెల్లించాల‌ని రిల‌య‌న్స్ డిఫెన్స్.. రిల‌య‌న్స్ ఇన్ ఫ్రాస్ట్ర‌క్చ‌ర్.. రిల‌య‌న్స్ ఏరో స్ట్రక్చ‌ర్స్ లు అహ్మాదాబాద్ సిటీ సివిల్ కోర్టులో కేసులు దాఖ‌లు చేశాయి.

రాఫెల్ డీల్ కు సంబంధించి రిల‌య‌న్స్ డిఫెన్స్  మీద క‌థ‌నాలు ప్ర‌సారం చేసిన ఎన్డీటీవీ ఛాన‌ల్ పై ఏకంగా రూ.10వేల కోట్ల మేర కేసులు వేసిన‌ట్లు  తాజాగా ఎన్డీటీవీ ఒక క‌థ‌నంలో ప్ర‌క‌టించింది. మీడియా ప్ర‌చురించిన క‌థ‌నాలు త‌మ ప‌రువు తీసేలా.. త‌మ కంపెనీల‌కు అప‌కీర్తి తెచ్చి పెట్టేలా  ఉన్నట్లు ప్ర‌క‌టించారు. మీడియాలో వ‌చ్చిన క‌థ‌నాల‌న్నీ ప్ర‌భుత్వం నుంచి తాము అనుచిత ల‌బ్థి పొందామ‌న్న భావ‌న సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు క‌లిగేలా క‌థ‌నాలు ఉన్న‌ట్లు పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. త‌మ‌పై వేసిన ప‌రువున‌ష్టం కేసుల‌కు సంబంధించి ఎన్డీటీవీ స్పందిస్తూ.. రాఫెల్ ఒప్పందానికి సంబంధించిన చ‌ర్చ‌కు రావాల‌ని తాము ఆ కంపెనీ ప్ర‌తినిధుల‌కు ప‌లుమార్లు కోరామ‌ని పేర్కొంది. రిల‌య‌న్స్ కు సంబంధించిన వివ‌ర‌ణ ఇచ్చేందుకు ఛాన‌ల్‌కు రావాల‌ని కోరింది. అయితే.. వాస్త‌వాల‌ను తొక్కిప‌ట్ట‌ట‌మే కాక‌.. త‌మ ప‌ని తాము చేయ‌కుండా మీడియాను బెదిరింపు ధోర‌ణితో అనిల్ అంబానీ కంపెనీలు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లుగా ఆరోప‌ణ‌లు చేసింది. మొత్తంగా చూస్తే.. రాఫెల్ వివాదంలో త‌న వాద‌న‌ను వినిపించాల్సిన రిల‌య‌న్స్ అదేమీ చేయ‌కుండా.. వేలాది కోట్ల చొప్పున ప‌రువున‌ష్టం దావాలు వేయ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News