దానం ఓ బ‌చ్చా.. చెల‌రేగిపోయిన అంజ‌న్‌

Update: 2018-06-25 05:08 GMT
ఎప్ప‌టి నుంచో అనుకున్న‌దే అయినా.. కొంత‌కాలంగా కానిది ఎదురైన‌ప్పుడు దాని ప్ర‌కంప‌న‌లు అంతో ఇంతో కామ‌న్‌. హైద‌రాబాదీ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత దానం నాగేంద‌ర్ గులాబీ కారు మీద మోజు అయ్యింద‌ని.. ఎప్పుడెప్పుడో ఎక్కుదామ‌న్న‌ట్లుగా ఉన్న ఆయ‌న‌.. ఎన్నిక‌ల‌కు ముందుగా గులాబీ కండువా వేయించుకోవ‌టం కాంగ్రెస్ వ‌ర్గాల్లో షాకింగ్ గా మారింది.

దానం పార్టీ మార‌టం ప‌క్కా అన్న మాట కొంత‌కాలంగా వినిపిస్తున్నా.. ఎప్ప‌టిక‌ప్పుడు వాయిదా వేసుకుంటున్న దానం.. ఈసారి ఎన్నిక‌ల వ‌ర‌కూ పార్టీలోనే ఉంటార‌న్న న‌మ్మ‌కాన్ని ప‌లువురు వ్య‌క్తం చేశారు. దానం తీరు బాగా తెలిసిన వారు మాత్రం ఆయ‌న గులాబీ కారు మీద మ‌న‌సు ప‌డ్డార‌ని.. కాంగ్రెస్ ను వీడిపోవ‌టానికి సిద్ధ‌మ‌య్యార‌న్న మాట‌ను చెబుతూ.. పార్టీ మార‌టం ప‌క్కా అని తేల్చేశారు.

అలాంటి అంచ‌నాల్ని నిజం చేస్తూ.. అధికార టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు దానం. దీంతో కాంగ్రెస్ వ‌ర్గాలు ఆగ‌మాగ‌మ‌య్యాయి. ఆయ‌న్ను పార్టీ నుంచి వెళ్ల‌కుండా ఉండేందుకు టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి స్వ‌యంగా దానం ఇంటికి వెళ్లారు. అయితే.. ఆయ‌న‌కు క‌నిపించ‌ని దానం.. అప్ప‌టికే మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ తో భేటీ కోసం వెళ్ల‌టం గ‌మ‌నార్హం.

కాంగ్రెస్ నుంచి జంప్ కావ‌టం.. త‌ర్వాత తిరిగి రావ‌టం దానం గ‌తంలో చేసిన ప‌నే. అలా చేసిన‌ప్ప‌టికీ క్ష‌మించి మంత్రి ప‌ద‌విని ఇచ్చి అంద‌లానికి ఎక్కించిన గొప్ప‌త‌నం కాంగ్రెస్ పార్టీదే. అలా ప‌వ‌ర్లో ఉన్న‌ప్పుడు పార్టీని ఒక రేంజ్లో వాడేసిన దానం.. ప‌వ‌ర్ పోయినంత‌నే పార్టీని ప‌ట్టించుకోని తీరుపై తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. హైద‌రాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న అంజ‌న్ కుమార్‌యాద‌వ్ తాజా ప‌రిణామాల‌పై తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు.

దానంపై మండిప‌డిన ఆయ‌న‌.. అత‌నో బ‌చ్చా అంటూ తేలిగ్గా తీసి పారేశారు. అంజ‌న్ కుమార్‌ కు తాను పార్టీ టికెట్ ఇప్పించిన‌ట్లుగా దానం చేసిన వ్యాఖ్య‌ల్ని ఖండించిన ఆయ‌న‌.. నాకు టికెట్ ఇప్పించ‌టం ఏంటి?  సిటీ కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌విని దానంకు ఇచ్చిందే నేనంటూ మండిప‌డ్డారు. ఆరోప‌ణ‌లు చేసే ముందు స్థాయి ఏమిటో తెలుసుకోవాలంటూ మండి ప‌డిన అంజ‌న్‌.. తాను సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌విని చేప‌ట్ట‌టంతో దానంకు భ‌యం ప‌ట్టుకుంద‌న్నారు.

హైద‌రాబాద్ న‌గ‌రానికి పార్టీ అధ్య‌క్షుడిగా నాలుగేళ్లుగా వ్య‌వ‌హ‌రించిన దానం ఒక్క కార్య‌క్ర‌మం కూడా చేప‌ట్ట‌లేద‌న్న విష‌యాన్ని గుర్తు చేశారు. టీడీపీలోకి వెళ్లి మ‌ళ్లీ కాంగ్రెస్ లోకి చేరి మంత్రి ప‌ద‌విని అనుభ‌వించిన దానంకు పార్టీ అన్యాయం చేసిందా? అంటూ సూటిగా ప్ర‌శ్నించారు అంజ‌న్ కుమార్‌. హోంమంత్రి నాయిని క‌బ్జాదారుడ‌ని త‌ప్పు ప‌ట్టిన దానంను.. టీఆర్ఎస్ పార్టీలోకి ఎలా చేర్చుకుంటార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. మొత్తానికి దానం పార్టీని వీడిపోయి వెళ్లిపోవ‌టాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు ఓ ప‌ట్టాన జీర్ణించుకోలేక‌పోతున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News