అన్న క్యాంటీన్ మూణ్నాళ్ల ముచ్చటైపోయింది

Update: 2016-10-21 08:18 GMT
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనలో మాటలు ఎక్కువ, చేతలు తక్కువ అన్న విపక్షాల విమర్శలు నిజమన్నట్లుగా మరో ఘటన జరిగింది. అధికారం చేపట్టినప్పుడు ఘనంగా ప్రకటించినా.. చచ్చీచెడీ రెండున్నరేళ్ల తరువాత కానీ ప్రారంభించలేకపోయిన అన్న క్యాంటీను గట్టిగా నెల రోజుల్లోనే మూతపడిపోయింది. అవును... వెలగపూడి సచివాలయంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ షట్టర్లు మూతపడ్డాయి. దీంతో సచివాలయంలోని చిరుద్యోగుల పరిస్థితి దయనీయంగా మారుతోంది.

అన్న క్యాంటీన్లను అన్ని చోట్లా ఏర్పాటు చేసి 5రూపాయలకే భోజనం పెడతామని ఘనంగా ప్రకటించిన ప్రభుత్వం దాన్ని అమలు చేయడంలో మాత్రం దారుణంగా విఫలమైంది. తమిళనాడులో అమ్మ క్యాంటీన్లలో 5 రూపాయలకే భోజనం పెడుతుండడంతో అలాంటివే మన రాష్ట్రంలోనూ ఏర్పాటు చేయాలన్నది చంద్రబాబు ఆలోచన అందుకోసం ప్రభుత్వం ఏర్పాటైన తరువాత మంత్రులు, అధికారులు పలుమార్లు చెన్నై వెళ్లి పరిశీలించారు. కానీ... రెండేళ్ల వరకు క్యాంటీన్లను ఏర్పాటు చేయలేకపోయారు. చివరికి మొన్న వెలగపూడిలో సచివాలయం ఏర్పాటైన తరువాత అక్కడ మొట్టమొదటిసారిగా ఒక క్యాంటీన్ నెలకొల్పారు. కానీ, అదీ ఇప్పుడు మూతపడిపోయింది.

సచివాలయంలోని 5వ భవనంలో సిఆర్‌డిఎ ఈ అన్న క్యాంటీన్‌ ఏర్పాటు చేసింది. అందులో సబ్సిడీ రేట్లతో ఆహార పదార్థాలను అందుబాటులోకి తెచ్చారు. కానీ గురువారం దాన్ని మూసేశారు. దీంతో చిరుద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. ఉద్యోగ నేతలు కొందరు సొసైటీ పేరుతో క్యాంటీన్లను వ్యాపార కేంద్రాలు గా మలచుకుంటున్నారని చిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు.  కాగా సచివాలయంలోనే ఉన్న మరో క్యాంటీన్ నిర్వాహకులకోసం దీన్ని మూసేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అన్న క్యాంటీన్ కాకుండా ఉన్న మరో క్యాంటీన్‌ లో ధరలు అందుబాటులో లేకపోవడంతో ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌, అటెండర్‌, డ్రైవర్‌ వంటి ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
Tags:    

Similar News