షాకింగ్ రిపోర్ట్: లాక్ డౌన్ మరో 5 నెలలు?

Update: 2020-04-04 05:15 GMT
ఏపీ రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై సీఎం జగన్ సర్కారు ఏర్పాటు చేసిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (బీసీజీ) తెలుగు ప్రజలకు సుపరిచితమే.. తాజాగా బీసీజీ సంచలన షాకింగ్ రిపోర్టును బయటపెట్టింది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఈ అమెరికన్ అధ్యయన సంస్థకు ప్రపంచవ్యాప్తంగా సర్వేల్లో మంచి పేరుంది.

తాజాగా లాక్ డౌన్ పరిస్థితులపై సంచలన రిపోర్టును బీసీజీ గ్రూపు వెల్లడించింది. ఇది దేశ ప్రజలను షాక్ కు గురిచేస్తోంది. కరోనా వైరస్ తో దేశంలో ప్రస్తుతం ఏప్రిల్ 14వరకు లాక్ డౌన్ కొనసాగుతోంది. అయితే తగ్గిందని భావించిన కరోనా ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనల ఘటనతో ఉవ్వెత్తున ఎగిసింది. దీంతో వీరి ద్వారా మరింత మందికి సోకడం ఖాయం కావడంతో లాక్ డౌన్ పొడిగించే వీలు కనిపిస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం లాక్ డౌన్ పొడిగించమని చెబుతోంది.

తాజాగా దేశంలో లాక్ డౌన్ పై బీసీజీ గ్రూపు శాస్త్రీయంగా అధ్యయనం చేసింది. ఈ మేరకు బయటపెట్టిన రిపోర్టు షాకింగ్ గా మారింది. దేశవ్యాప్తంగా కరోనా విస్తృతి దృష్ట్యా జూన్ రెండోవారం వరకు లాక్ డౌన్ కొనసాగే అవకాశాలున్నట్లు బీసీజీ తెలిపింది. అవసరమైతే సెప్టెంబర్ రెండోవారం వరకూ కొనసాగవచ్చని అభిప్రాయపడింది. అధిక జనాభా ఉన్న భారత్ లో వైరస్ వ్యాపిస్తే పెను వినాశనం కనుక లాక్ డౌన్ ఎక్కువ కాలం కొనసాగిస్తారని తెలిపింది.

వైరస్ పుట్టిన వూహాన్ లోనే చైనా కేవలం రెండు నెలలు మాత్రమే లాక్ డౌన్ విధించింది. అలాంటిది అంతగా లేని దేశంలో 5నెలల పాటు లాక్ డౌన్ పొడిగిస్తారా అన్నది అనుమానంగా మారింది. అయితే వైరస్ విస్తృతి దృష్ట్యా లాక్ డౌన్ పొడిగించవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Tags:    

Similar News