భారత భూభాగంలో మరో ఆర్మీక్యాంపు..! చైనా బరితెగింపు..!

Update: 2021-03-26 08:30 GMT
గత ఏడాది లడఖ్​ సరిహద్దుల్లో ఉద్రిక్త పరస్థితులు నెలకొన్నది మొదలు.. చైనా భారత్​ తో కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. అప్పట్లో చైనా సైనికులతో జరిగిన దాడిలో మన సైనికులు దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇప్పటికీ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సృష్టిస్తూనే ఉంది. అరుణాచల్​ ప్రదేశ్​ తమ భూభాగమేనని ఆ దేశం చెప్పుకుంటూ ఉంటుంది. అంతేకాక ఆ రాష్ట్రంలో ఓ గ్రామాన్ని కూడా నిర్మించింది. మరోవైపు లఢక్​ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద కూడా తరుచూ చైనా పీపుల్స్​ లిబరేషన్​ ఆర్మీ (పీఎల్​ఏ) ఏదో ఓ క్యాంపు ఏర్పాటు చేస్తూ రెచ్చగొడుతూ ఉంటుంది.

తాజాగా సిక్కిం సమీపంలోని నకు లా పాస్ వద్ద వివాదాస్పద ప్రదేశాల్లో కొత్తగా ఆర్మీ పోస్టులను ఏర్పాటు చేసింది. ఈ మేరకు జాతీయ మీడియా చానల్​ ఇండియా టుడే ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.  చైనా నిర్మించిన గ్రామానికి సంబంధించిన ఉపగ్రహ ఛాయాచిత్రాలను విడుదల చేసింది. భారత్-చైనా సరిహద్దులను పంచుకుంటోన్న సిక్కిం సమీపంలోని డోక్లామ్, నకు లా పాస్ తరచూ వివాదాలకు కేంద్రబిందువు అవుతూ వస్తున్నది.  భారత్-చైనా-భూటాన్ సరిహద్దుల్లో ట్రై జంక్షన్‌ గా గుర్తింపు ఉన్న డోక్లామ్ ప్రాంతం వద్ద గ్రౌండ్ జీరో వద్ద 2017లో భారత్-చైనా జవాన్ల మధ్య ఘర్షణపూరక వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.

క్యాపెల్లా స్పేస్‌ కంపెనీకి చెందిన సింథటిక్-అపెచ్యుర్ రాడార్, ప్లానెట్ ల్యాబ్స్ చిత్రీకరించిన ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో ఈ ఆర్మీ పోస్టులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మార్చి 12వ తేదీన రాడార్ ఈ ఫొటోలను తీసింది. చైనా మిలటరీ కార్యకలాపాలు ఉధృతంగా కొనసాగుతున్న విషయాన్ని బట్టబయలు చేసింది. కొత్త శిబిరాలు, పోస్టులు, రోడ్ల నిర్మాణాలు ముమ్మరంగా సాగుతున్నట్లు ఇండియా టుడే తన ప్రత్యేక కథనంలో పేర్కొంది.

అయితే చైనా ఆర్మీ తీసుకుంటున్న ఈ దుందుడుకు చర్యలపట్ల మనదేశం ఇంకా స్పందించలేదు. ఈ వివాదాలు, చాయా చిత్రాలపై భారత ఆర్మీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇప్పటికే భారత్​, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. చైనాకు చెందిన పలు యాప్​ లను మనదేశం బ్యాన్​ చేసింది. దీంతో ఆ దేశం తీవ్రంగా నష్టపోయింది. తాజాగా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాలి.
Tags:    

Similar News