పీవీపీ పై మరో కేసు.. ఫిర్యాదు చేసింది డీకే అరుణ కుమార్తె

Update: 2022-01-19 08:30 GMT
ప్రముఖ వ్యాపారవేత్తగా.. సినీ నిర్మాతగా.. వైసీపీ నేతగా సుపరిచితులు పొట్లూరి వరప్రసాద్  అలియాస్ పీవీపీ. తరచూ ఆయన మీద ఏదో ఒక వివాదం ప్రచారంలోకి వస్తుంటుంది. ఈ మధ్యనే ఆయనపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లోకేసు నమోదైంది. తాజాగా ఆయనపై మరో కేసు నమోదుకావటం ఆసక్తికరంగా మారింది. అయితే.. ఈ కేసుకు కారణంగా.. మాజీ మంత్రి.. ప్రస్తుతం బీజేపీ నేతగా వ్యవహరిస్తున్న డీకే అరుణ కుమార్తె శృతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదు చేసినట్లుగా చెబుతున్నారు.

ఇంతకూ అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే.. పీవీపీ అనుచరుడు బాలాజీతో పాటు.. మరికొందరు కలిసి డీకే అరుణ కుమార్తె శృతిరెడ్డి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి.. ఆమె సొంతంగా నిర్మించుకున్న ప్రహరి గోడను.. రేకుల్ని జేసీబీతో ధ్వంసం చేశారని చెబుతున్నారు. అంతేకాదు.. ఈ సందర్భంగా శృతిరెడ్డిని బెదిరించినట్లుగా ఆరోపిస్తున్నారు. పోలీసులు వెల్లడిస్తున్న సమాచారం ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెంబరు 7లో ఒక విల్లాను డీకే అరుణ కుమార్తె శృతిరెడ్డి కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన రిపేర్లలో భాగంగా.. ప్రహరిగోడను నిర్మిస్తున్నారు.

దీనికి అభ్యంతరం వ్యక్తం చేస్తూ పీవీపీ మనుషులు తమ ఇంట్లోకి వచ్చి దౌర్జన్యానికి పాల్పడినట్లుగా ఆమె చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పీవీపీతో పాటు.. ఆయన అనుచరులుగా చెబుతున్న బాలాజీ.. అతనికి సహకరించిన మరికొందరిపైనా కేసులు నమోదు చేసినట్లుగా బంజారాహిల్స్ పోలీసులు చెబుతున్నారు.

రెండేళ్ల క్రితం కూడా ఇంటి మరమ్మతులు చేసుకుంటున్న ఇంట్లోకి వెళ్లి.. ఆ ఇంటిని కూలగొట్టిన ఉదంతంలోనూ పీవీపీ మీద కేసు నమోదైంది. ఈ కేసు విచారణ సందర్భంగా పీవీపీ ఇంటికి వెళ్లిన పోలీసులపైకి కుక్కల్ని వదిలిన వైనం అప్పట్లో విదాస్పదం కావటంతో పాటు.. పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు చెబుతారు. ఈ కేసులో అరెస్టు కాకుండా ఉండేందుకు బెయిల్ తెచ్చుకోవటం.. ప్రస్తుతం ఆ కేసు కోర్టు విచారణలో ఉన్నట్లు చెబుతారు. తాజా ఉదంతంలో బీజేపీ నేత కుమార్తె ఇంటి మీద దౌర్జన్యం చేయటం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎపిసోడ్ లో మరేం జరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News