తాడిపత్రిలో హీట్‌.. జేసీపై మరో కేసు!

Update: 2022-10-19 08:04 GMT
అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని కేసులు వదిలిపెట్టడం లేదు. 2019 ఎన్నికల్లో జేసీ దివాకర్‌రెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి పోటీ చేయకుండా వారి కుమారుడు జేసీ పవన్‌ కుమార్‌ రెడ్డి, జేసీ అస్మిత్‌రెడ్డిలను బరిలో దించారు. అనంతపురం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా దివాకర్‌రెడ్డి కుమారుడు జేసీ పవన్, తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రభాకర్‌రెడ్డి కుమారుడు అస్మిత్‌ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో జేసీ బ్రదర్స్‌కు కష్టాలు మొదలయ్యాయి. జేసీ కుటుంబ సంస్థ అయిన దివాకర్‌ ట్రావెల్స్‌కు సంబంధించిన వాహనాల అక్రమ కొనుగోళ్లు, అక్రమ రిజిస్ట్రేషన్లు, నిబంధలనకు విరుద్ధంగా వాటిని తిప్పడం వంటి కారణాలతో జేసీ బ్రదర్స్‌పై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి.

బస్సులకు సంబంధించిన కేసులే కాకుండా నియోజకవర్గంలో వివిధ గొడవలకు సంబంధించి కూడా కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ప్రభాకర్‌రెడ్డి బెయిల్‌పై ఉన్నారు.

కాగా తాజాగా తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌గా ఉన్న జేసీ ప్రభాకర్‌రెడ్డిపై మరో కేసు నమోదైంది. ప్రభాకర్‌ రెడ్డితో పాటు 13 మంది టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఈ తాజా కేసు నేపథ్యం ఏమిటంటే.. తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండలం జూటూరు గ్రామంలో రెండు రోజుల క్రితం వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. వైసీపీ కార్యకర్తలపై టీడీపీ వారు దాడి చేశారంటూ మొత్తం 13 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. ఓ స్థలం విషయంలో జరిగిన గొడవ ఈ దాడికి కారణమైందని చెబుతున్నారు.

ఈ దాడులలో తెలుగుదేశం పార్టీకి చెందిన నారాయణ రెడ్డి, కె. నారాయణ రెడ్డి, సూర్యనారాయణరెడ్డితో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక వైసీపీకి చెందిన ఎర్రగుడి రామ్మోహన్‌ రెడ్డి, వినయ్‌ కుమార్‌ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి, ప్రతాప్‌ రెడ్డిలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇరువర్గాల ఘర్షణ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడినవారిని తాడిపత్రి, పెద్దపప్పూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఇరు పార్టీల ఘర్షణ నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దీంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక జేసీ వర్గీయులు తమపై దాడి చేశారని ఎర్రగుడి రామ్మోహన్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డిని ప్రధాన నిందితుడిగా చేర్చి, మొత్తం 13 మందిపై కేసు నమోదు చేశారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News