భారత్ లో మరో కరోనా పాజిటివ్ కేసు..ఆందోళన

Update: 2020-03-06 15:01 GMT
కోవిడ్ 19(కరోనా) మహమ్మారి క్రమక్రమంగా తన జడలు విప్పుతూ ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. చైనాలోని వుహాన్ లో పుట్టిన ఈ మహమ్మారి చైనాతో పాటు, ఇటలీ, ఇరాన్ లలో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. చైనా తర్వాత ఇటలీ, ఇరాన్ లలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఇరాన్ లోని పలువురు ప్రముఖులు కూడా ఈ వైరస్ బారిన పడి విలవిల లాడుతున్నారు. ఈ క్రమంలోనే కరోనా మహమ్మారి ధాటికి తాళలేక ఇరాన్‌ విదేశాంగ మంత్రి సలహాదారు హుస్సేన్ షేఖోలెస్లాం మృత్యువాత పడ్డారు. కరోనా వల్ల హుస్సేన్ మరణించినట్లు ఆ దేశ అధికారులు ధృవీకరించారు. ఇప్పటికే ఇరాన్ లోని 23 మంది ఎంపీలకు కరోనా ఉందన్న అనుమానంతో పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కరోనా దెబ్బకు ఇరాన్ లో 107 మంది మరణించారు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ వరకు ఇరాన్ లోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని సూచించారు.


ప్రపంచవ్యాప్తంగా 85 దేశాలను కరోనా పట్టి పీడిస్తోంది. ఇప్పటికే కరోనా దెబ్బకు 3350 మంది అశువులు బాశారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు లక్ష మంది ఈ మహమ్మారి బారిన పడి నరకయాతన అనుభవిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఇక భారత్‌ లోనూ కరోనా శరవేగంగా వ్యాపిస్తోంది. తాజాగా ఇండియాలో మరో కరోనా కేసు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో దేశ రాజధానిలో కలకలం రేగింది. ఆ వ్యక్తిని ఐసోలేషన్‌ వార్డుకు తరలించి ప్రత్యేక చికిత్సనందిస్తున్నారు. థాయ్‌లాండ్‌ నుంచి మలేషియా వెళ్లిన సదరు వ్యక్తి అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకున్నట్లు తెలుస్తోంది. దీంతో భారత్‌ లో కరోనా కేసుల సంఖ్య 31కి చేరింది. కరోనా వైరస్‌ స్క్రీనింగ్‌ కోసం ఇరాన్‌లో మొట్టమొదటి క్లినిక్‌ను ఏర్పాటు చేయడానికి భారత వైద్య బృందాన్ని కోమ్‌ సిటీకి పంపిచనున్నట్లు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు.

Tags:    

Similar News